మెండోరా/నిజాంసాగర్, జూలై 17 : ఎగువ ప్రాం తాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎస్సారెస్పీలో వరద ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి 16,920 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె. రవి ఆదివా రం తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 2,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువలోకి 3, 500, వరద కాలువలోకి 10 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 142.152 టీఎంసీల వరద వచ్చి చేరిందని తెలిపారు. దిగువ గోదావరి, కాకతీయ, వరద కాలువలకు 85.488 టీఎంసీలు వదిలినట్లు పేర్కొన్నారు. ఈ సీజన్లో కాకతీయ కాలువకు 1.48 టీఎంసీలు, వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 74.56, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1.55, వరద కాలువకు 3.76 టీఎంసీలు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కా గా ఆదివారం సాయంత్రానికి 1088.20 అడుగుల (77.663 టీఎంసీలు) వద్ద ఉందని ఏఈఈ తెలిపారు.
నిజాంసాగర్‌లోకి 1960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి 1960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1400.08 అడుగుల (11.44 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు.
పర్యాటకుల సందడి
ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రాజెక్టును సందర్శించడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు ఆదివారం తరలివచ్చారు. ప్రాజెక్టు అందాలను తమ కెమెరాల్లో బంధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పర్యాటకులు రావడంతో సందడిగా మారింది. దీంతో ప్రాజెక్టు వద్ద చిరుదుకాణాలు సైతం వెలిసాయి.