ఇందూరు, జూలై 17: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కో-ఆర్డినేటర్ భాస్కర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్సెస్సార్ డిస్కవరీ స్కూల్ -మాధవ్నగర్, కేంద్రీయ విద్యాలయం- బోధన్, నవ్యభారతి గ్లోబల్ స్కూల్ -దాస్నగర్, నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్-అర్సపల్లి, సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్- ఆర్మూర్, ఎస్సెస్సార్ డిగ్రీ కళాశాల -ఖలీల్వాడీ, ప్రెసిడెన్సీ హైస్కూల్ -మోపాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగగా ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతించలేదన్నారు. మొత్తం 2366 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2299 మంది పరీక్షకు హాజరయ్యారని, 67 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.