ఇందూరు, జూలై 17 : పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊరపండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరం జనసంద్రమైంది. ఊర పండుగలో ప్రధానమైన పదార్థం సరిని నగరవాసులు తమ ఇండ్లపై, పొలాల్లో ఎంతో భక్తిప్రపత్తులతో చల్లుకున్నారు. పిల్లాజెల్ల, పాడిపంట, గొడ్డూగోజ అంతా సరిగ్గా ఉండేలా చూడు తల్లీ అంటూ.. అమ్మవార్లను వేడుకున్నారు. అమ్మవారి తొట్లెలు, బండారి సమర్పణలు, గుగ్గిలం పొగలు, కల్లు సాకలు, జీవ బలులు, డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల పూనకాలు, భవిష్యవాణి.. ఇలా జిల్లాకేంద్రంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించింది. ఊర పండగ నిర్వహణ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, కార్యదర్శి బంటు రాజేశ్వర్‌తోపాటు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ సూదం లక్ష్మి, సర్వసమాజ్ కన్వీనర్ యెండల లక్ష్మీనారాయణ, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఖిల్లా రఘునాథ్ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె (తేలు మైసమ్మ గద్దె) వద్ద పూజలు చేశారు. దేవతామూర్తులను ఊరేగింపుగా గాజులపేట్ చౌరస్తా మీదుగా పెద్దబజార్ చౌరస్తా నుంచి రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పౌడలమ్మ, నల్లపోచమ్మ, అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ, పులిరాజులు, రాట్నం, తొట్లెలతో దుబ్బ వైపు ఊరేగింపుగా వెళ్లింది. రెండో బృందం సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌లోని ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయం వైపు వెళ్లింది. సరిని దక్కించుకోవడం కోసం భక్తులు పోటీపడ్డారు.