నిజామాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలనలో చినుకు రాలితే ఇబ్బందే.. రోడ్లపై ఏర్పడే గుంతలు దాటడం కష్టంగా ఉండేది. పట్టణాలు, నగరాల్లో మ్యాన్‌హోల్స్ నరకానికి స్వాగతం పలికినట్లుగా ఉండేవి. రోడ్లపై సుదూర ప్రయాణం చేయాలంటే వానకాలంలో కష్టమన్నట్లుగా దాపురించేది. ఎప్పుడు ఎక్కడ ఏ వరదొచ్చి ప్రయాణం నిలిచిపోతుందో తెలియని దుస్థితి. అంతేకాకుండా ఏ చెరువు తెగిపోయి వరద అడ్డు తగులుతుందోననే అయోమయ పరిస్థితి. ఇంతటి విపత్కర పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు భారీ ఉపశమనం ఇప్పుడు దక్కుతున్నది.
సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధితో అందుకు తగిన ఫలితాలు కనిపిస్తున్నాయి. పల్లె నుంచి మండల కేంద్రానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా నుంచి రాజధానికి ఇలా కనెక్టివిటీ పెంచుతూ నిర్మించిన రోడ్లు, వంతెనలు, కల్వర్టుల మూలంగా భారీ వానల్లోనూ ఇబ్బందులు తలెత్తలేదు. పైగా మిషన్ కాకతీయ పథకం ద్వారా సుందరీకరణకు నోచుకున్న తటాకాలతోనూ లాభం జరిగింది. అతి భారీ వర్షం కురిసినప్పటికీ ఎక్కడా చెరువులు తెగి జనజీవనాన్ని ఆగం చేసిన దుస్థితి కనిపించకపోవడం రాష్ట్ర సర్కారు గొప్పతనానికి నిదర్శనమే.
పునరుద్ధరణకు రూ.717.42 కోట్లు..
గతంలో చెరువుల్లోకి వర్షపు నీరు చేరడమే గగనంగా ఉండేది. ఇప్పుడు కాలువలు సైతం మరమ్మతులు చేయడంతో సులువుగా వరద వచ్చి చేరడం కంటికి కనిపిస్తున్నది. జల వనరుల శాఖ అధికారుల సర్వేలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ చెరువుల పరిధిలో ఎండిపోయిన బావులు, బోరు బావులు తిరిగి పునర్జీవం పొందాయి. భారీ వానలకు అత్యల్ప కాలంలోనే నిజామాబాద్ జిల్లాల ఇరిగేషన్ సీఈ పరిధిలో మొత్తం 968 చెరువులుండగా 98శాతం అంటే 954 చెరువులు అలుగులు పోశాయి. కామారెడ్డి జిల్లా ఇరిగేషన్ సీఈ పరిధిలో 2069 చెరువులకు 85శాతం అంటే 1764 చెరువులు 100 శాతం జలకళను సంతరించుకోవడం విశేషం.
గోదావరి వంతెన..
గోదావరి నదిపై భారీ వంతెన నిర్మాణంతో నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు భారీ ప్రయోజనం దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. రాకపోకలను సులువుగా చేయడంతోపాటు వ్యాపార, వాణిజ్య అవసరాలను పెద్ద ఎత్తున కల్పించడమే ధ్యేయంగా రూ.108 కోట్లతో పనులు చేపట్టింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం, దిలావర్పూర్, ముథోల్ మండలాల ప్రజలకు విద్యా, వైద్యం కోసం నిజామాబాద్‌కు రావడం ఇక సులువు అవుతుంది. ఆర్మూర్ నియోజకవర్గ వాసులకు భైంసా వెళ్లేందుకు ఇదే రహదారి ఉపయుక్తంగా మారుతుంది. దశాబ్దాల నుంచి తీరని కల తెలంగాణ ఏర్పడిన తర్వాత నెరవేరనున్నది. గోదావరి నదిపై 500 మీటర్లు, అటు ఇటు మరో 80 మీటర్లు మేర వంతెన నిర్మాణం జరిగింది. రూ.80కోట్లు వరకు వెచ్చించారు. గోదావరి నుంచి నందిపేటకు 9కిలోమీటర్ల మేర రోడ్డు పనులు శరవేగంగా జరుగనున్నాయి.
మారిన జుక్కల్ రూపురేఖలు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రవాణా వ్యవస్థలో ఎస్ఎన్ఏ రోడ్డు ఎంతో కీలకంగా మారింది. సంగారెడ్డి నుంచి నాందెడ్ మీదుగా అకోలా వరకు పనులు చేపట్టగా మొదటి దశలో 136కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా సంగారెడ్డి – దెగ్లూర్ వరకు విస్తరించారు. రెండో దశలో దెగ్లూర్ – అకోలా వరకు అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. రూ.2793 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ రహదారి పనులు పూర్తి కావడంతో జుక్కల్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ ప్రభుత్వ కీలక భాగస్వామ్యంతో నిర్మించిన ఈ రోడ్డుతో వెనుకబడిన ప్రాంతం ఇప్పుడు కొంగొత్త రూపును సంతరించుకున్నది. రోడ్డు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం 205.850 హెక్టార్ల భూమిని సేకరించింది. జాతీయ రహదారుల నిర్మాణంలో సుమారుగా 12 వంతెనలు, 23 కల్వర్టుల నిర్మాణంతో ప్రజలకు ఉపశమనం దక్కింది. ఇక నిజామాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్ వరకు 63వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. దీని విస్తరణ కోసం రూ.117.56 కోట్ల వ్యయంతో నూతన రహదారులు నిర్మించారు. ఇందులోనూ కల్వర్టులు, వంతెనల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి.
అంతర్రాష్ట్ర వారధికి మహా పేచి..
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు సాలూరా వద్ద మంజీరను ప్రామాణికంగా తీసుకొని అవతలి భాగం మరాఠాకు, ఇటువైపు ప్రాంతాన్ని ఏపీలో కలిపారు. నిజాం పాలకులు నిర్మించిన రాతి వంతనెపైనే రాకపోకలు సాగేవి. రవాణా ఇబ్బందులు గుర్తించిన ఆనాటి రెండు రాష్ర్టాల పాలకులు 1985లో కిలోమీటర్ మేర బ్రిడ్జిని నిర్మించారు. పాత వంతెనకు ఎత్తులో నిర్మించిన వంతెన సైతం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నది. దీంతో కొత్త వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ నిధులు మంజూరుకు మోకాలడ్డారు.
చెక్కుచెదరని తటాకాలు…
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు మిషన్ కాకతీయ పథకం అంటే చెరువులను బాగు చేసుకోవడం ఒక్కటే కాదు. వర్షపు నీటిని 10 నెలల పాటు నిల్వ చేసుకొని ఆయకట్టుకు కొరత లేకుండా సాగు నీరందించడమనే ప్రధానమైన ఉద్దేశం. తటాకాల్లో పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువుల సామర్థ్యం పెరిగింది. గతంలో దశాబ్దాలుగా కూరుకుపోయిన పూడికను తీయడం ద్వారా చెరువులకు పునర్వైభవం వచ్చింది. స్వరాష్ట్రం ఏర్పడడానికి ముందు భారీ వానలు పడితే ఎక్కడో ఒక చోట చెరువులకు బుంగ పడడం, గండి పడి కొట్టుకపోవడం వంటివి కనిపించేవి. ఇప్పుడు చెరువు కట్టలు బలోపేతం చేయడంతో చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయి. లీకేజీలతో కొట్టుమిట్టాడిన తూములు బాగుపడడంతో ఇబ్బందులు కనిపించడం లేదు.
భారీ వంతెనతో శాశ్వత పరిష్కారం..
రెంజల్, జూలై 16: రెంజల్ మండల కేంద్రం శివారులోని మొండి వాగుపై వరద ప్రవహిస్తే రాకపోకలు నిలిచిపోయేవి. ఈ వాగు గుండా కందకుర్తి, నవీపేట, బోధన్, నిజామాబాద్ పట్టణాలకు ప్రజలు ప్రయాణించేవారు. వంతెన నిర్మించాలని ఉమ్మడి రాష్ట్ర పాలకులను మొర పెట్టుకున్నా…మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. 2016లో రూ. 2.70 కోట్లతో భారీ వంతెన నిర్మించారు. ఇప్పుడు వానకాలంలోనూ రాకపోకలు సాఫీగా కొనసాగుతున్నాయి.
మార్గం సుగమం
నిజామాబాద్ రూరల్, జూలై 16: నిజామాబాద్ మండలంలోని ముత్తకుంట గ్రామశివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువపై మూడేండ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి(వంతెన)తో గ్రామస్తులు, పశువుల రాకపోకలకు ఎంతగానో సౌలభ్యకరంగా మారింది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వంతెన నిర్మాణం కోసం గ్రామస్తులు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పడి.. రూరల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ చూపి వంతెనను రూ.50లక్షల నిధులతో నిర్మించారు.
సమస్యలు తీరాయి ..
నిజాంసాగర్ కాలువ బయట 150 ఎకరాల పంట పొలాలున్నాయి. పంట సాగు కోసం కాలువ అవతలి వైపు వెళ్లి రావడానికి అవస్థలు పడేవాళ్లం. వంతెన నిర్మాణంతో ఇబ్బందులు తొలగిపోయాయి.
-జలందర్గౌడ్, సర్పంచ్ ముత్తకుంట
వల్లభాపూర్-దోమలెడ్గి మధ్య వారధి..
కోటగిరి, జూలై 16 : కోటగిరి మండలంలోని వల్లభాపూర్ – దోమలెడ్గి మధ్య రూ.1.30కోట్లు వెచ్చించి 2018-19సంవత్సరంలో కొత్తగా వంతెనను నిర్మించారు. గతంలో వర్షాలు కురిస్తే వరద ఉధృతి పెరిగి రోడ్డు పైనుంచి నీర్లు పొంగిపొర్లుతుండేవి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో వంతెన నిర్మాణం పూర్తికావడంతో రాకపోకలకు ఇబ్బందులు తీరాయి.
సాఫీగా ప్రయాణం..
కోటగిరి, జూలై 16 : 2021 జూలైలో కురిసిన భారీ వర్షాలకు కోటగిరి- ఎత్తొండ మధ్య ఉన్న వాగు వరదతో పొంగిపొర్లింది. ఎత్తొండ, కోటగిరితోపాటు ఆయా గ్రామాల ప్రజలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించి వంతెన నిర్మాణానికి 2021 నవంబర్‌లో రూ.1.53 కోట్లు మంజూరు చేయించారు. సకాలంలో పనులు పూర్తికావడంతో భారీ వర్షం కురిసినా రాకపోకలు కొనసాగుతున్నాయి.
ఇబ్బందులు తొలిగాయి..
ఎత్తొండ- కోటగిరి మధ్య రూ.1.53కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ సర్కార్ కొత్తగా బ్రిడ్జి కట్టించింది. ఇంతకుముందు వానలు పడితే వంతెన మీద నుంచి వరద నీరు పొంగిపొర్లుతుండే. దీంతో ఎత్తొండ నుంచి కోటగిరి వెళ్లలేకపోతుంటిమి. రెండు రోజుల వరకు నీరు తగ్గకుండే.. గిప్పుడు బ్రిడ్జి కట్టడంతో ఇబ్బందులు లేవు. ఎంత వాన పడ్డ భయం లేదు..
– విఠల్, గ్రామస్తుడు ఎత్తొండ
వెతలు తీర్చిన వంతెన..
కోటగిరి, జూలై 16 : దోమలెడ్గి- కొల్లూర్ గ్రామాల మధ్య రూ.2.30 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం వంతెన నిర్మించింది. 2018 కన్నా ముందు వంతెన లేకపోవడం, ఉన్న రోడ్డు కాస్తా లోతట్టుగా ఉండడంతో వరద పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయేవి. వంతెన నిర్మాణంతో ప్రయాణికుల వెతలు తీరాయి.
గుండెవాగుపై రూ.కోటీ60లక్షలతో..
మెండోరా, జూలై 16: మెండోరా మండలం వెల్కటూర్ – వెంచిర్యాల్ మధ్య ఉన్న గుండెవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రూ.కోటీ60లక్షలు మంజూరు చేయించారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో వానకాలంలో ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగుతున్నాయి. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ కాలువపై..
ఏర్గట్ల, జూలై 16: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వానకాలంలో బట్టాపూర్, తొర్తి గ్రామాల మీదుగా ప్రయాణం చేయాలంటే నరకంలా అనిపించేది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బట్టాపూర్-తొర్తి గ్రామాల మధ్య ఉన్న కాకతీయ కాలువపై వంతెనను రూ.కోటిన్నరతో నిర్మించారు. దీంతో ఏర్గట్ల మండలంతోపాటు నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తీరాయి.
రామన్నపేట్-వేల్పూర్ వంతెన
వేల్పూర్, జూలై 16: మండల కేంద్రం – రామన్నపేట్ గ్రామాల మధ్య కప్పలవాగు ప్రవహిస్తే రాకపోకలు ఆగిపోయేవి. ఈ వాగు గుండా మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు సాగేవి. వంతెన కావాలని ఆయా గ్రామాల వారు గత పాలకులను మొర పెట్టుకున్నా.. మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. 2014 తర్వాత రూ.7 కోట్లతో భారీ వంతెన నిర్మించారు.
పచ్చలనడుకుడ – వేల్పూర్ వంతెన
ఈ రెండు గ్రామాల మధ్య పెద్ద వాగు వానకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. వేల్పూర్, పచ్చల నడుకుడతోపాటు మండలంలోని అంక్సాపూర్, పడగల్, అమీనాపూర్, సాహెబ్పేట్, జాన్కంపేట్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. సీఎం కేసీఆర్ అయ్యాక రూ.6 కోట్లతో పెద్ద వంతెన నిర్మించారు. ఇప్పుడు వానకాలంలోనూ రాకపోకలు సాఫీగా జరుగుతున్నాయి.
నిర్మాణంలో భారీ వంతెనలు
వేల్పూర్ పెద్ద వాగు, మోతె పెద్ద వాగులు భారీ వర్షం కురిస్తే నిండు గా పారుతూ రాకపోకలు నిలిచేపో యే సందర్భాలు ఉంటాయి. అరవై ఏండ్ల పాలనలో అప్పటి పాలకులు ఈ వాగుల కష్టాలు గట్టెక్కించే ఆలోచన చేయలేదు. కానీ 2014 తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దీనిపై దృష్టి సారించి మోతె వాగుపై రూ.12కోట్లు, వేల్పూర్ వాగుపై రూ.15 కోట్లతో హైలెవెల్ వంతెనలు మంజూరు చేయించారు. వాటి నిర్మాణం జరుగుతున్నది.
వాగు ఎంత పారినా వేల్పూర్ చేరుడే..
గతంలో కప్పలవాగు పారితే వేల్పూర్ వెళ్లలేక పోయేవాళ్లం. ఈ వాగుపై వంతెన కడ్తారని కలలో కూడా ఊహించలేదు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో భారీ వంతెన కట్టారు. ఇప్పుడు వాగు ఎంత పారినా వేల్పూర్ చేరుడే
-శోభన్, రామన్నపేట్
బాధలు తీరాయి..
పచ్చల నడుకుడ-వేల్పూర్ మధ్యనే కాకుండా వాగుకు రెండువైపులా ఉన్న పలు గ్రామాల మధ్య ఎంత వరద వచ్చినా కొత్త బ్రిడ్జి నిర్మించడంతో రాకపోకలు ఆగే ముచ్చటనే లేదు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల చేసిన మేలు మరువం. మొన్నటి వానల్లో బ్రిడ్జి లేని రోజుల్లో పడ్డ కష్టాలు గుర్తుకువచ్చాయి.
– నల్ల రమేశ్, పచ్చల నడుకుడ
వంతెన నిర్మాణంతో తీరిన తిప్పలు
నందిపేట్, జూలై 16: నందిపేట్ మండలంలో ప్రధాన సమస్యలుగా ఉన్న జోర్పూర్, వెల్మల్ వాగులపై రాష్ట్ర ప్రభుత్వం వంతెనలు నిర్మించి ప్రజలకు సౌలభ్యకరంగా మార్చింది. వర్షం కురిసి వాగు ప్రవహించినప్పుడల్లా నందిపేట్ – ఆర్మూర్ ప్రధాన రోడ్డుకు జోర్పూర్ వద్ద, వెల్మల్- ఆర్మూర్ వెళ్లే రోడ్డుపై వెల్మల్ వాగు వద్ద రాకపోకలు నిలిచిపోయేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే వంతెన నిర్మించడంతో ప్రజల ఇబ్బందులు తీరాయి.