నిజామాబాద్ క్రైం, జూలై 16: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఏటీఎం, బ్యాంకులే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు. ఈ దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారగా.. నిందితులు ఇతర రాష్ర్టాలకు చెందినవారిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి అనంతరం జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతంలో ఏటీఎంలు, బ్యాంకులను టార్గెట్ చేసుకుంటున్నారు. పక్కాప్లాన్ వేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. గడిచిన పది నెలల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పరిధిలో ఓ బ్యాంకు నుంచి రూ. 4కోట్లు ఎత్తుకెళ్లిన ఘటనతోపాటు ఏడు చోట్ల ఏటీఎం సెంటర్లలో దోపిడీకి యత్నంచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఒక ఏటీఎం నుంచి రూ.11 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన వెలుగుచూసింది. చోరీ సంఘటనల్లో కొన్నిచోట్ల స్థానికులు దొంగతనాలకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. మరికొన్నిచోట్ల అంతర్రాష్ట్ర ముఠా ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
గత సెప్టెంబర్‌లో భారీ దోపిడీ
గతేడాది సెప్టెంబర్‌లో నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇందల్వాయి మండల కేంద్రం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇండియా వన్ ఏటీఎం సెంటర్‌పై అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు దాడి చేశారు. ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి అందులో నుంచి రూ.13 లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు లభించిన ఆధారాలను బట్టి ఏటీఎంలో చోరీకి పాల్పడిన దుండగులు హర్యానా రాష్ర్టానికి చెందిన కరుడుగట్టిన దొంగల ముఠాగా గుర్తించారు. సదరు ముఠాను పట్టుకునేందుకు డిచ్పల్లి సీఐ రఘునాథ్ ఆధ్వర్యంలో హర్యానా రాష్ర్టానికి వెళ్లారు. అయినప్పటికీ అక్కడ తలదాచుకున్న దొపిడీ ముఠా సభ్యులను పట్టుకోలేకపోయారు.
గత అక్టోబర్‌లో బండరాయితో ఏటీఎం ధ్వంసం..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో హెచ్డీఎఫ్ బ్యాంక్‌కు సంబంధించిన ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో బండరాయితో ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి యత్నించాడు. అదే సమయంలో హైదరాబాద్‌లో సీఈసీటీవీ సర్వేలెన్స్ ద్వారా సైరన్ మోగడంతో అక్కడి అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు అప్రమత్తమై ఏటీఎం సెంటర్‌కు చేరుకోగా దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం ఆదే ప్రాంతంలో మరో ఏటీఎంలో చోరీకి యత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.
నవంబర్‌లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం
నగరంలోని నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీ యత్నం సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక పద్మానగర్ లోని ఏటీఎంలోకి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి చొరబడి మిషన్‌ను ధ్వసం చేశాడు.అందులోంచి డబ్బులు తీస్తున్న సమయంలో స్థానికుల అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
డిసెంబర్లో ఇందల్వాయిలో మళ్లీ యత్నం..
ఇందల్వాయి మండలంలో ఉన్న ఏటీఎంలో దుండగులు మళ్లీ చోరీకి యత్నించారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలో చొరబడిన దుండగులు మిషన్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు.
ఏప్రిల్‌లో ధర్పల్లి మండల కేంద్రంలో..
మూడు నెలల క్రితం ధర్పల్లి మండల కేంద్రంలోని ఏటీఎం సెంటర్లో ఓ యువకుడు చోరీకి యత్నించి పోలీసులకు పట్టుబడ్డాడు. మేస్త్రి పని చేసే ఓ యువకుడు ఏటీఎంను ధ్వంసం చేసేందుకు యత్నించి అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పట్టుబడ్డాడు.
ఎడపల్లి మండల కేంద్రంలో..
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు చోరీకి యత్నించారు. గుర్తు తెలియని దుండగులు ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేసి పారిపోయాడు.
గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ..
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన భారీ దోపిడీ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. సినీఫక్కీలో దుండగులు గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులోని లాకర్‌ను ధ్వంసం చేశారు. రూ.7లక్షల 35వేల నగదుతోపాటు 8కిలోల 30 తులాల బంగారు ఆభరణాలు (మొత్తం రూ.4కోట్లు) ఎత్తుకెళ్లారు. దోపిడీ విషయం తెలుసుకున్న సీపీ నాగరాజు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇతర రాష్ర్టాలకు పంపించారు.
హైవే పక్కన ఏటీఎంలకు సెక్యూరిటీ కరువు
ఏటీఎంలో చోరీలు, చోరీలకు యత్నాలు జరగడానికి కారణం ఏటీఎం సెంటర్లు జాతీయ రహదారుల పక్కనే ఉండడమేనని పోలీసులు పేర్కొంటున్నారు. గతేడాది ఇందల్వాయి ఏటీఎంలో చోరీ జరిగిన సమయంలో అప్పటి డిచ్పల్లి సీఐ రఘూనాథ్ హైవేల పక్కన ఉన్న ఏటీఎంలను మూసివేయించారు. ఈ ఏటీఎంలకు సెక్యూరిటీ లేకపోవడంతోనే తరచూ చోరీలు జరుగుతున్నాయని సంబంధిత బ్యాంకు అధికారులకు సూచించినట్లు పోలీసులు తెలిపారు.
పది నెలలు గడుస్తున్నా కొలిక్కిరాని ఏటీఎం చోరీ కేసు
గతేడాది సెప్టెంబర్‌లో ఇందల్వాయి మండల కేంద్రంలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ వివరాలు తెలిసిన్నప్పటికీ అందులో ఏ ఒక్కరిని సైతం పట్టుకున్న దాఖాలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెండోరా బ్యాంకు దోపిడీ కేసులో పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. నిందితులకు సంబంధించిన పలు ఆధారాలు పోలీసులకు లభించినట్లు తెలిసింది. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని సీపీ నాగరాజు తెలిపారు.
భిక్కనూర్ మండలం జంగంపల్లిలో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
భిక్కనూర్, జూలై 16 : కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి యూనియన్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి గుర్తుతెలియని దుండగులు యత్నించారు. అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లడానికి ధ్వంసం చేశారు. శనివారం ఉదయం బ్యాంకు సిబ్బందికి సమాచారం అందడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ధ్వంసమైన ఏటీఎంను పరిశీలించారు. క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తామని ఎస్సై ఆనంద్‌గౌడ్ తెలిపారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇదే బ్యాంకులో భారీ చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. సుమారు రూ.35 లక్షల వరకు ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డును నియమించాలని కోరారు.