బోధన్/ బోధన్ రూరల్/ రెంజల్/ నవీపేట, జూలై 14: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే షకీల్ డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న అతి భారీ వర్షా లు, వరదల వైపరీత్యాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని, రాష్ర్టానికి తక్షణ సహాయంగా రూ.20 వేల కోట్లు అం దించాలన్నారు. గురువారం ఆయన రెంజల్తోపాటు బోధన్ మండలంలోని కొప్పర్గ , హంగర్గ గ్రామాల్లో ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. బోధన్, ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లో వర్షాల నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెంజల్, బోధన్, నవీపేట మండలాల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలతో నష్టం జరుగుతున్నప్పటికీ ఎంపీ అర్వింద్ మాత్రం స్పందించడంలేదని విమర్శించారు. అవాకులు, చెవాకులు మాట్లాడడం కాకుండా ప్రస్తుత భారీ వర్షాలు, వరదలను జాతీయ విపత్తు కింద ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రభుత్వం నుంచి తీసుకురావాలని సవాల్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌కు నిజంగా దమ్ముంటే ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద రూ.20 వేల కోట్లు తీసుకొచ్చి రైతులకు ఆదుకోవాలన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి సోషల్ మీడియా ఎంపీగా అర్వింద్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బాధ్యతగల ఎంపీగా ఉండి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఓట్లు వేసిన ప్రజలు ఆయనను గల్లవట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. తక్షణ సహాయంగా రాష్ర్టానికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకురావాలని సూచించారు. ఇప్పటి వరకు బోధన్ నియోజకవర్గంలో పర్యటించని ఎంపీ అర్వింద్‌కు ఏ గ్రామం ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని, అమెరికాలో కూర్చొని సోషల్ మీడియా ఎంపీగా కాకుండా నిజామాబాద్ ఎంపీగా మాట్లాడాలని సూచించారు. మూడున్నరేండ్లలో బోధన్ నియోజకవర్గానికి ఎంపీ అర్వింద్ నయాపైసా నిధులు మంజూరుచేసిన దాఖలాలు లేవన్నారు. ప్రకృతి విపత్తు సంభవిస్తే క్షేత్రస్థాయిలో రైతుల బాగోగులు తెలుసుకోలేని ఎంపీ అర్వింద్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.