మెండోరా, జూలై 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గడ్డెన్న వాగు, పెద్దవాగు, మహారాష్ట్రలోని విష్ణుపురి, అముదుర, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి, ఎగువ ప్రాంతాల్లో కరుస్తున్న వర్షాలకు 3లక్షల 936 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని ప్రాజెక్టు ఏఈఈ సారిక గురువారం తెలిపారు. 36 వరదగేట్లతో దిగువ గోదావరిలోకి 2 లక్షల 99 వేల 936 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 108 టీఎంసీల వరదవచ్చి చేరిందని తెలిపారు. కాకతీయ కాలువకు మూడు వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి మూడు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లక్షా 87 వేల 460 క్యూసెక్కులు, 36 గేట్ల ద్వారా లక్షా 50 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోందని వివరించారు.
నిజాంసాగర్‌లోకి 25,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్, జూలై14: నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమం గా పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి 25,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టులో 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు) సామర్థ్యానికి 1398.88 అడుగుల (10.18 టీఎంసీలు) నీరు నిలువ ఉన్నట్లు ఈఈ సొలోమాన్ తెలిపారు. కళ్యాణి ప్రాజెక్టు 409.50 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండి ఉండగా ఎగువప్రాంతం నుంచి 2600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ఐదు వరద గేట్ల ద్వారా నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు.సింగీతం ప్రాజెక్టు 416.50 పూర్తిస్థాయి నీటి మట్టం తో నిండి ఉండగా ఎగువప్రాంతం నుంచి 3600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో అలుగు ద్వారా మంజీరలోకి విడుదల చేస్తున్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు 458.00 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండి ఉండగా ఎగువ భాగం నుంచి 4480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో రెండు వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
సింగూరులోకి 15,955 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సింగూరు ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రానికి 15,955 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 523.600 మీటర్లు (29.917 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 522.166 అడుగుల (22.417 టీఎంసీలు) వద్ద నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
పోచారంలోకి కొనసాగుతున్న భారీ ఇన్‌ఫ్లో
నాగిరెడ్డిపేట్, జూలై 14 : పోచారం ప్రాజెక్టులోకి లింగంపేట్, గుం డారం, గాంధారి తదితర ప్రాంతాల నుంచి 12,341 క్యూసెక్కుల వదర వచ్చి చేరుతున్నదని ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. చెప్పారు. ప్రధాన కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా.. 12,291 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు పైనుంచి పొంగి పొర్లుతున్నదని తెలిపారు.