బోధన్ రూరల్/నవీపేట/రెంజల్/ఎడపల్లి, జూలై 14 : బోధ న్ నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గురువారం పర్యటించారు. బోధన్ మండలంలోని హంగర్గ, కొప్పర్గ గ్రామాల్లో వరద ప్రాంతాల ను ఆయన పరిశీలించారు. వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల్లో కూడా ఆర్డీవో, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు బాగానే పని చేస్తున్నారన్నారు. రైతులను ఆదుకునేందుకు తనవంతుగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానన్నారు. ఎస్సారెస్పీ అవుట్ ఫ్లో పెంచాలని మంత్రికి విన్నవించానన్నా రు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ సావిత్రి, రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దెరాజేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ శరత్, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సన్న, రజాక్, బోధన్ ఏసీపీ రామారావు తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల పరిషత్ కార్యాలయం లో భారీ వర్షాలకు నష్టపోయిన పంటలపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే షకీల్ సమీక్ష నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో ఆయా శాఖల అధికారులతో జరిగిన నష్టంపై నివేదికలు తయారు చేయించి పరిహారం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. గత ఏడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న నాళేశ్వర్-తల్వేద బ్రిడ్జి మరమ్మతులకు ఏఆర్ఆర్ పథకం కింద రూ.16.06 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించాలని పీఆర్ అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను అంచన వేసేందుకు సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. భారీ వర్షాలతో వివిధ గ్రామాల్లో ఏర్పడిన విద్యుత్ సమస్యలను పరిష్కారించడంలో స్థానిక ఏఈ నిర్లక్ష్యం వహించాడని, ఆయన పనితీరుపై పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఈ ప్రవీణ్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఏఈని ఆదేశించారు. యంచ పరిధిలోని అల్జాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డుకు వరద నీరు పోటెత్తడంతో రెండు రోజులుగా రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని సర్పంచ్ లహరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే బోటు ఏర్పాటు చేస్తానని అన్నారు.
ఈ మేరకు అలీసాగర్ ప్రాజెక్టులో ఉన్న బోటును టూరిజం శాఖ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ హరీశ్, తహసీల్దార్ వీర్‌సింగ్, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఎంపీవో రామకృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అబ్బన్న, పోశెట్టి, బుచ్చన్న, కిషన్‌రావు, మాణికేశ్వర్రావు, సంజీవ్‌రావు తదితరులు పాల్గొన్నారు. వర్షానికి కూలిపోయి నిరాశ్రయులైన వారికి డబుల్ బెడ్ రూం మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఎమ్మెల్యే షకీల్ మండల స్థాయి అధికారులతో శాఖల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. వర్షానికి నీట మునిగిన పంటలపై క్షేత్ర స్థాయిలో సమగ్రంగా వివరాలను సేకరించాలని ఆదేశించారు. పంట నష్టం వివరాలను రెండు రోజుల్లో అందిస్తే సీఎం కేసీఆర్‌కు నివేదిస్తానని అన్నారు.
పీఆర్ఏ లిఖిత మౌలాలీ తండాలో వైకుంఠధామం పనులు చేపట్టిన బిల్లుల కోసం ఇబ్బంది పెడుతున్నదని, సకాలంలో స్పందించడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సమీక్షా సమావేశంలో ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ రజిని, జడ్పీటీసీ విజయ, మండల వివిధ శాఖల అధికారులు, విండో చైర్మన్లు భూమారెడ్డి, ప్రశాంత్, ఇమ్రాన్బేగ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పంట నష్టం, కూలిన ఇండ్లపై ఎమ్మెల్యే షకీల్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు అందించిన వివరాల ప్రకారం 58 ఇండ్లు కూలాయని, రెండు వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఎడపల్లిలో 250 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. దీంట్లో మొదటి ప్రాధాన్యత ఇండ్లు కూలిన వారికి ఉంటుందని, మిగతావి సొంత స్థలం ఉన్నవారికి రూ.మూడు లక్షల లోన్ ఇస్తామని తెలిపారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, ఎంపీడీవో సాజిద్ అలీ, తహసీల్దార్ శేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.