నిజామాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓ వైపు గోదావరి, మంజీర పరీవాహక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ భారీ వానలు. వెరసి గోదావరి, మంజీర నదుల్లో వరద పోటెత్తుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంజీరలో జల కాంతులు సంతరించుకున్నాయి. చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ, దిగువ భాగాల్లోనూ వరద ప్రవాహం భారీగా కనిపిస్తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పెద్దవాగు, కాకి వాగుల గుండా మంజీరకు జలజీవం వచ్చి చేరుతోంది. భారీ, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల్లోనూ పుష్కలంగా నీరు వచ్చి చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటుకుని అలుగు పోస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ఆయకట్టు రైతుల్లో సంబురం కనిపిస్తోంది. జూలై రెండో వారానికే వరుణుడు ఉగ్రరూపం చూపడంతో భారీ ఎత్తున జల ప్రవాహాలతో జీవ నది గోదావరి సై తం ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంజీర, హరిద్రా నదుల్లోనూ వరద పోటెత్తుతుండడంతో త్రివేణి సంగమ క్షేత్రం కందకుర్తి తీవ్ర స్థాయిలో ప్రవాహాన్ని అందుకుని ఎస్సారెస్పీ చెంతకు చేరుతోంది. రికార్డు స్థాయిలో ఆదివారం గోదావరి నదిలో ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఉగ్ర గోదావరి..
గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఉగ్ర రూపం దాల్చిన జీవ నది ఆదివారం కూడా అదే స్థాయిలో కనిపించింది. మరింత ఎక్కువగా రూపుదాల్చడంతో పరీవాహక ప్రాంతాల్లో ఆందోళన నెలకొన్నది. నిన్న, మొన్నటి వరకు గోదావరి నదిలో సాధారణ స్థితిలో కనిపించిన వరద.. ఇప్పుడు ఊహించని రీతిలో ప్రవహిస్తున్నది. తెలంగాణలో గోదావరికి ముఖద్వారమైన కందకుర్తి నుంచి మొదలు పెడితే పోచంపాడ్ వర కు గోదావరి నది ప్రాంతమంతా వరదతో పోటెత్తుతోం ది. వివిధ ప్రాంతాల గుండా ఉప్పొంగి వస్తున్న వర్షపు నీరంతా వాగులు, వంకల ద్వారా వచ్చి జీవనదితో సంగమిస్తోంది. నదీ ప్రవాహంలో గంటగంటకూ మా ర్పులు కనిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 5లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో వరద ఎస్సారెస్పీకి చేరింది. శనివారం మాదిరిగానే ఆదివారం ఉదయం వాన దంచికొట్టింది. మధ్యాహ్నం పూట కాసింత విరామం ఇవ్వడంతో ప్రజలకు ఉపశమనం దక్కింది. తిరిగి చిరుజల్లులతో కూడిన వాన అందుకోవడం ద్వారా రోడ్లపై తిరిగేందు కు ప్రజలు ఆసక్తి చూపలేక ఇండ్లకే పరిమితమయ్యా రు. సెలవు దినం కావడంతో పాటు బక్రీద్, తొలి ఏ కాదశి కలిసి రావడంతో అన్ని వర్గాల ప్రజలంతా స్వ గృహాల్లోనే పండుగను సంతోషంగా జరుపుకొన్నారు.
రెండు రోజులు 40 టీఎంసీలు…
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీకి లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఆదివారం ఉదయం నుంచి 5లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండడంతో నీటి మట్టం అమాంతం పెరిగింది. శుక్రవారం 29.90 టీఎంసీలుగా ఉన్న ఎస్సారెస్పీ నీటి నిల్వ ఇప్పుడు 73 టీఎంసీలకు చేరింది. సోమవారం తెల్లవారుజాము నాటికి భారీ వానలు కురిస్తే మరింతగా నీటి నిల్వ పెరిగే అవకాశం ఉంది. జూలై 10వ తేదీకే ఇంత భారీ వరద రావడం రికార్డు అని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దశాబ్దన్నర క్రితం ఇలాంటి పరిస్థితి కనిపించిందని అంటున్నారు. గడిచిన 48 గంటల్లో ఎస్సారెస్పీకి 40 టీఎంసీల మేర అదనపు జలాలు చేరడం ద్వారా 1087.02 అడుగుల నీటి మట్టానికి ఎస్సారెస్పీ చేరుకున్నది. పోచంపాడ్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) మేర నీటి నిల్వ సామర్థ్యం ఉంది. వరద నియంత్రణతోపాటు ఇతర అవసరాల నిమిత్తం ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్సారెస్పీ ఇంజినీర్లు వరద కాలువ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 10వేల క్యూసెక్కులతో నీరు మిడ్ మానేరు ప్రాజెక్టుకు చేరుకుంటున్నది. 9 వరదగేట్లు ఎత్తి గోదావరిలోకి దిగువకు 25వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. క్రమంగా 18గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు పెంచనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా 1392 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు 5.474 టీఎంసీల నీరుంది.
మంజీర పరవళ్లు…
నిజాంసాగర్ ప్రాజెక్టు నిండి వరద గేట్లు ఎత్తితే కానీ మంజీరా నదిలో నీటి జాడను ఊహించడం కష్టం. అలాంటిది నాలుగు రోజుల భారీ వానల మూలం గా చారిత్రక ప్రాజెక్టుకు ఎగువ, దిగువ ప్రాంతాల్లో వరద కనిపిస్తోంది. పోచారం ప్రాజెక్టు మత్తడి పోస్తుండడంతో ఇక్కడి వరద నీరంతా నిజాంసాగర్‌కు పరుగులు తీస్తోంది. సింగీతం, కళ్యాణి, పోచారం ప్రాజెక్టుల నుంచి మిగులు జలాలు ఇటువైపే కదులుతున్నాయి. ఇక దిగువ ప్రాంతంలోనూ మంజీరా నదిలో జోరుగా ప్రవాహం ఏర్పడింది. వాగులు, వంకల గుండా వచ్చే జలాలతో కందకుర్తి వద్ద గోదావరి నదితో మంజీర భారీ జలాలతో సంగమిస్తుండడంతో ప్రవాహం మరింతగా హెచ్చుమీరుతున్నది. తద్వా రా కందకుర్తి పాత వంతెనకు ఆనుకుని గోదావరి జలాలు ముందుకు కదులుతున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అల్ప పీడన ద్రోణి కారణంగా సోమవారం కూడా భారీ వర్ష సూచనలున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ల్లో అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ వర్షపాతాన్ని మించి వానలు కురిశాయి. చెరువులు, కుంటలు అలుగులు, మత్తడులు పారుతున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి, రోడ్లు కొట్టుకుపోయి ఆదివారం కూడా పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచి పోగా ఎప్పటికప్పుడు ఎన్పీడీసీఎల్ సిబ్బంది పునరుద్ధరణ చేపట్టారు.