జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కూలిన ఇండ్లు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 10:ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రంతా జోరు వానలు కురుస్తున్నాయి. పొద్దాంత ముసురు పడుతున్నది. నాలుగు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పలు చెరువులు నిండి అలుగుపోస్తుండగా, మరికొన్ని చెరువులు నిండుకుండల్లా మారాయి. వర్షపు నీటితో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉధృతికి రోడ్లు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలు కురవడంతో ప్రాజెక్టుల నీటిమట్టం పెరుగుతున్నది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలుచోట్ల ఇండ్లు కూలిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.