నిజామాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. 36 గంటల పాటు ఏకధాటిగా పడిన జడివానతో జన జీవనం స్తంభించిం ది. వరద నీటి ప్రవాహంతో ఏరులు, దారులూ ఏకమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి వరదనీరు చేరింది. నిజామాబాద్ రూరల్ మండలంలో ఇద్దరు గల్లంతయ్యారు. రెండు జిల్లాల్లో సుమారు 118 ఇండ్లు కూలి పోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నవీపేట మండలంలో రికార్డుస్థాయిలో 23 సెం.మీ. వర్షం కురిసింది. భీమ్‌గల్, ఆర్మూర్, డిచ్పల్లి, నందిపేట, మాక్లూర్, కమ్మర్పల్లి, గాంధారి తదితర మండలాల్లోనూ భారీగా వర్షపాతం నమోదైంది. గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్సారెస్పీకి 1.71 లక్షల క్యూసెక్కులు, నిజాంసాగర్ జలాశయానికి 5,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో రెండు జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రెండు జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు.
రెండు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. శనివారం పొద్దంతా కురిసిన భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, చాలా చోట్ల కాలనీలు, గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 118 పెంకుటిళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వరద చేరడంతో శనివారం ఒక్కరోజే వందకు పైగా చెరువులు అలుగులు పోశాయి. మిగిలిన చెరువులు కూడా రేపోమాపో మత్తడి దూకనున్నాయి.
రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వాన కురిసింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. నవీపేటలో 23 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లాకు రెడ్, కామారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు.. సహాయక చర్యలు చేపట్టేందుకు ఆయా శాఖల సిబ్బందిని రంగంలోకి దించారు.
ఏకధాటిగా…
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. శనివారం పొద్దంతా వాన పడుతూనే ఉండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యా రు. రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. అత్యవసర పనులు ఉన్న వారు మాత్రమే బయటికి వచ్చారు. చెరువులు, వాగులు, వంకల్లో వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి.
జల దిగ్బంధం..
ఎడతెరిపి లేని వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు, కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాన నీరు పోటెత్తడంతో ఆర్మూర్‌లోని పలు కాలనీలు చెరువులను తలపించాయి. వరద చుట్టేయడంతో కాలనీ వాసులు బయట అడుగు పెట్టలేక పోయారు. ఇదే పరిస్థితి నిజామాబాద్ నగరంలోని మాలపల్లి, అర్సపల్లి ప్రాంతాల్లోనూ కనిపించింది. బాసరకు వెళ్లే ప్రధాన రహదారిపై మోకాలు లోతులో నీరు నిలువడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నటరాజ్ థియేటర్ నుంచి అర్సపల్లి వరకు వరద నీరంతా రోడ్డుపైకి రావడంతో డబుల్ రోడ్డు కాస్తా వన్‌వేగా కొనసాగింది. పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోనూ పలు కాలనీల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాన్సువాడలో రేకుల షెడ్డు కూలి ముగ్గురికి గాయాలయ్యాయి. రెవెన్యూ అధికారుల ప్రాథమిక అంచనా మేరకు నిజామాబాద్ జిల్లాలో సుమారు 70 ఇండ్లు కూలిపోగా, 34 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. కామారెడ్డి జిల్లాలో 48 ఇండ్లు నేలమటమయ్యాయి. పురాతన ఇండ్లలో నివసిస్తున్న వారిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగానే అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం తప్పింది.
యంత్రాంగం అప్రమత్తం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సహాయ చర్యలకు ముందస్తుగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారులంతా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. ఇక ఎన్పీడీసీఎల్ సిబ్బంది సైతం ప్రమాదాలు సంభవించకుండా ప్రజలను సోషల్ మీడియాలో అప్రమత్తం చేశారు. పలు చోట్ల స్తంభాలు, చెట్లు నేలకూలడంతో వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. గోదావరి, మంజీర నదులకు భారీ ఎత్తున వరద వస్తుండడంతో పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
రెడ్ అలర్ట్..
రుతుపవనాల కదలికల మేరకు వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు నిజమయ్యాయి. ఇందులో భాగంగా రానున్న మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం ఉద యం నుంచి శనివారం ఉదయం వరకు నిజామాబాద్ జిల్లాలో 46 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. సిరికొండ మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది.