ఖలీల్‌వాడి, జూన్ 24 : జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఇందుకోసం తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో కనీస సదుపాయాలతో పాటు ప్రసవాలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన చేపట్టేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో బృందంలో జిల్లాస్థాయి అధికారితో పాటు డిప్యూటీ డీఎంహెచ్‌వో, ప్రోగ్రాం ఆఫీసర్ తదితరులున్నారు. ఏ అంశాలను పరిశీలించాలి, నివేదిక ఎలా సమర్పించాలి తదితర అంశాలపై శుక్రవారం సెల్‌కాన్ఫరెన్స్ ద్వారా తనిఖీ బృందాలకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. శనివారం నుంచే దవాఖానల పరిశీలన చేపట్టాలని, ప్రతిరోజు కనీసం రెండు హాస్పిటల్స్‌ను తనిఖీ చేస్తూ పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.
సామాజిక బాధ్యతగా భావిస్తూ పరిశీలన విధులను పక్కాగా నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న కాన్పుల్లో 75 శాతం సీజేరియన్లే అవుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లో ఏకంగా 92 శాతం సీజేరియన్లు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న కర్ణాటకతో పాటు ఇతర రాష్ర్టాల్లో కేవలం 35 శాతం మాత్రమే సీజేరియన్లు అవుతుండగా జిల్లాలోని కొన్ని ప్రైవేట్ దవాఖానల్లో వందకు వంద శాతం సీజేరియన్లు జరగడం దారుణమన్నారు. తనిఖీ బృందాల పరిశీలనతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో సీజేరియన్ చేస్తే తప్పేమి లేదని, కానీ అవసరం లేకపోయినా సీజేరియన్ చేయడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఈ తరహాలో తప్పిదాలకు పాల్పడే దవాఖానల విషయంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతుందని, మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అంతేగాకుండా తనిఖీ బృందాలు అందించే నివేదికను ప్రజల ముందు ఉంచుతామన్నారు. నిబంధనలకనుగుణంగా పనిచేసే దవాఖానలకు జిల్లా యంత్రాంగం పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. సెల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజన, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్, డీపీవో జయసుధ, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.