ఇందూరు, జూన్ 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారులందరూ పక్షం రోజుల పాటు తీవ్రంగా శ్రమించి, సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధించారని కలెక్టర్ నారాయణరెడ్డి ప్రశంసించారు. సోమవారం ప్రగతిభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధామ్యాలను గుర్తిస్తూ నిర్ధేశిత లక్ష్యాలను సాధించేందుకు అంకితభావంతో కృషి చేశారని అభినందించారు. ఇకపై కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. పల్లెప్రగతిలో అక్కడక్కడ మిగిలిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయిస్తూనే హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని దిశానిర్ధేశం చేశారు. పల్లె/పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్‌కు సంబంధించి ఖాళీ ప్రదేశాలు, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించాలని సూచించారు.
ప్రధానంగా ఈ దఫా హరితహారంలో 141 బృహత్ పల్లెప్రకృతి వనాల్లో విరివిగా మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీంతో పాటు కాలువలు, చెరువు గట్ల వెంబడి మొక్కలు నాటేలా సమగ్ర అంచనాలతో ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని 106 గ్రామపంచాయతీల పరిధిలో పదెకరాల చొప్పున అటవీ భూముల్లో జీపీల ఆధ్వర్యంలో మొక్కలు నాటి, సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లా మీదుగా వెళ్తున్న రెండు జాతీయ రహదారులకిరువైపులా ఈసారి మల్టీ లేయర్‌గా అందమైన పూలమొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ పరిధిలో పది హెక్టార్ల చొప్పున విస్తీర్ణంలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతూ ఇదివరకు నాటిన మొక్కల సంరక్షణ చర్యలను పటిష్టపర్చాలన్నారు. చిన్నాపూర్, సారంగాపూర్‌లోని అర్బన్ పార్కుల్లోనూ ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్‌లో భాగంగా ట్రాన్స్‌కో కార్యాలయాలు, రైతువేదిక భవనాల ఆవరణల్లో విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన దృష్ట్యా జిల్లా విద్యాశాఖ, రెసిడెన్షియల్, సంక్షేమశాఖ అధికారులు శాఖాపరమైన విధులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా సంక్షేమ వసతిగృహాల్లో సుమారు రూ. రెండు కోట్లు వెచ్చిస్తూ మరమ్మతులు జరిపిస్తున్నందున నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ‘మన ఊరు – మన బడి’ కింద కొనసాగుతున్న పనులన్నీ నిర్ధేశిత ప్రమాణాలకు లోబడి పూర్తిచేయాలని ఆదేశించారు. వానకాలం దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కల్తీ విత్తనాలకు ఆస్కారం లేకుండా గట్టి నిఘాను కొనసాగిస్తూ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.