నిజామాబాద్ క్రైం, జూన్ 20 : ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన దంపతులు తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ డబ్బులు దండుకొని పారిపోయారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోని దిగిన నిజామాబాద్ జిల్లా పోలీసులు ఆ కిలాడీ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ సోమవారం తన కార్యాలయంలో సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన కర్రెద్దుల మాల్యాద్రి అతని భార్య కర్రెద్దుల సుభాషిని ఇద్దరు కలిసి ఈ నెల 7వ తేదీన టీవీఎస్ మోపెడ్‌పై నిజామాబాద్ జిల్లా పరిధిలోని మాక్లూర్ మండలం సట్లాపూర్ తండాకు చెందిన లకావత్ రాము లు వద్దకు వచ్చారు. తమ వద్ద సుమారు 30 తులాల బంగారు వడ్డాణం ఉందని దానిని తక్కువ ధరకే ఇస్తామంటూ న మ్మించి వారి వద్ద ఉన్న బంగారు పూత పూసిన వడ్డాణం రాములు కు చూపించారు.
వారి మాటలను నమ్మిన అతడు తన వద్ద ఉన్న రూ.5.40లక్షలు వారికి అప్పగించాడు. ఇంతలో ఆ దంపతులు ఓ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిసి రాములుకు తాగించారు. అది తాగిన వెంటనే రాములు స్పృహ తప్పిపోవడంతో అతడు ఇచ్చిన డబ్బులతోపాటు నకిలీ వడ్డాణాన్ని తీసుకొని వారు అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటికి కోలుకున్న రాములు మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని సౌత్ రూరల్ సీఐ నరేశ్ ఆధ్వర్యంలో మాక్లూర్ ఎస్సై, సిబ్బంది రంగంలోకి దిగారు. పలు ఏరియాల్లోని సీసీ ఫుటేజ్ తో పాటు సాంకేతిక పరమైన ఆధారాలతో సోమవారం నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.2.22 లక్షల నగదుతో పాటు నకిలీ బంగారు వడ్డాణం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన సీఐ నరేశ్, ఎస్సై యాదగిరి గౌడ్‌తోపాటు సిబ్బందిని సీపీ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్ అభినందించారు.