ఇందూరు, జూన్ 20 : జిల్లాలో నీటి వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కేంద్రీయ భూగర్భజల బోర్డు అధికారులు జిల్లాలో భూగర్భ జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో సాగు రంగానికి అత్యధికంగా 97 శాతం భూగర్భజలాలు వినియోగమవుతుండగా, మిగతా 3 శాతం పరిశ్రమలు, గృహావసరాలకు వాడుతున్నారని తెలిపారు. గడిచిన సీజన్లో సాధారణం కన్నా కొంత మేర ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ నీటి వాడకం విపరీతంగా ఉండడంతో అనేక మండలాల్లో భూగర్భజల మట్టం పడిపోయిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్మూర్, మోర్తాడ్, చందూర్ మండలాల్లో భూగర్భజలాలు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, మరో పది మండలాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని పేర్కొన్నారు.
సమస్య తీవ్రతను గుర్తించి నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించుకుని తప్పనిసరిగా ఆచరించాలని, వాన నీరు భూమిలో ఇంకే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ఏరియాలో గోదావరి నది ఒడ్డున పోచంపాడ్ నుంచి నవీపేట్ మండలం బినోల వరకు 33 అడుగుల వెడల్పుతో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం పనులను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభం కావాలని గడువు విధించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తమ పరిధిలోని అటవీ ప్రాంతంలోని పది హెక్టార్ల విస్తీర్ణంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వచ్చే సోమవారం నుంచి పనులు ప్రారంభం కావాలని, ఉపాధిహామీ కూలీలను పనులకు వినియోగించుకోవాలని సూచించారు. చిన్నాపూర్, సారంగాపూర్ అర్బన్ పార్కుల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సునీల్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ల్యాండ్ అండ్ సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’ ఫిర్యాదులను పరిష్కరించాలి
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించా రు. ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 74 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను స్వీకరిం చిన కలెక్టర్ వెంటవెంటనే ఆన్లైన్లో వివరాలను పొందు పర్చాలని, సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను ఫిర్యా దుదారులకు తెలుపాలని అధికారులకు కలెక్టర్ సూచిం చారు. అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, ఆర్డీవో రవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.