నిజామాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి):నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కార్గో చుక్కానిలా మారింది. సంస్థకు మంచి ఆదాయం సమకూరడంతో సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు. వినియోగదారులకు కచ్చితమైన సర్వీసును అందిస్తూ కార్యకలాపాలను పెంచుకుంటూ పోతున్నారు. ఆర్టీసీ అంటే ఒకప్పుడు ప్రజా రవాణాకే పరిమితమయ్యేది. కొంతమంది సిబ్బంది బస్సుల్లో సరుకులను అక్రమంగా రవాణా చేస్తూ తమ జేబులను నింపుకొనేవారు. నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని కాపాడాలనే ఆలోచనలో భాగంగా సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు నేడు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి. కార్గో సేవల అమలులో కేసీఆర్ చొరవ వెలకట్టలేనిది. ప్రత్యేకంగా బస్సులను రూపొందించి రాష్ట్ర రాజధానితోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రారంభించిన కార్గో.. ఇప్పుడు రాష్ట్రమంతటా శాఖోపశాఖలుగా విస్తృతమవుతున్నది. ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూరుస్తున్న వనరుగా కార్గో రూపొందింది. పైసా పెట్టుబడి లేకుండా, అందుబాటులో ఉన్న సదుపాయాలతోనే రూ.కోట్లలో ఆదాయం వస్తుండడంతో ఆర్టీసీలో జోష్ కనిపిస్తున్నది. నిజామాబాద్ రీజియన్లో 2020, జూన్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా రూ.5.84 కోట్ల ఆదాయం రావడం గమనార్హం.
ఇంతింతై వటుడింతై…
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆర్టీసీలో కార్గో సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. పొరుగు రాష్ర్టాలతోపాటు అంతర్రాష్ట్ర స్థాయి సేవలు సైతం అందుతున్నాయి. కార్గో ప్రారంభంలో నామమాత్రంగా మొదలైన కౌంటర్లు ఇప్పుడు పదుల సంఖ్యలో ఏర్పాటుచేశారు. నిజామాబాద్ జిల్లా రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో ఆర్టీసీ కార్గో సేవలు లాభసాటిగా మారాయి. రూ. కోట్లాది ఆదాయంతో ఆర్టీసీకి కార్గో సేవలు ఒకింత బలాన్ని అందిస్తున్నాయి. సేవలను బలోపేతం చేసేందుకు అధీకృత ఏజెన్సీలకు రోడ్డు రవాణా సంస్థ ఊతమిస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశంగా కార్గో సేవలు దోహదపడుతున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో కొరియర్, పార్సిల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ. వందకు 12 రూపాయల కమీషన్ చెల్లిస్తూ కార్గో, కొరియర్ పార్సిల్ అధీకృత కేంద్రాలను అందుబాటులో తెచ్చారు. నేరుగా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోనే ఆర్టీసీ సిబ్బందితో సెంటర్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆర్టీసీ 15 కౌంటర్లను ఏర్పాటుచేయగా, 8 చోట్ల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. ఆర్మూర్, భీమ్గల్, వర్ని, బోధన్, నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్, కసాబ్గల్లి, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో అధీకృత ఏజెన్సీలు ఉన్నాయి.
రెండేండ్ల క్రితం ప్రారంభం..
సరిగ్గా 2020, జూన్ 19న కార్గో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పార్సిల్, కొరియర్ సేవలు ప్రారంభించి క్రమేపీ విస్తరిస్తూ పోయారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో కార్గోను గొలుసుకట్టు విధానంగా మార్పు చేశారు. ఆదాయ మార్గాల కోసం అన్వేషించిన ప్రభుత్వానికి.. ఈ కొత్త రకం సేవలు ఊరటను అందించాయి. సంస్థను లాభాలబాట పట్టించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు సైతం చమటోడ్చి కార్గో సేవలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించడంతోపాటు సంస్థ అందిస్తున్న నాణ్యమైన సేవలను వివరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో పార్సిళ్లను త్వరగా గమ్యానికి చేర్చడంతో ప్రజల్లోనూ కార్గో గుర్తింపు పొందింది. చిన్నపాటి కవర్ల నుంచి భారీ వస్తు సామగ్రి రవాణా కోసం వినియోగదారులు ఆర్టీసీ కార్గోను ఆశ్రయిస్తున్నారు. కొవిడ్ కష్ట కాలంలో మొదలైన కార్గో సేవలతో ఆర్టీసీకి భారీ ఉపశమనమే దక్కింది. లాక్డౌన్తో ప్రజా రవాణా స్తంభించి తీవ్రంగా ఎదురు దెబ్బ తగిలినా.. ఆర్టీసీకి కార్గో సేవలు ఒక ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా నిలిచాయి.
లాభాలు ఇలా…
నిజామాబాద్ రీజియన్లోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ -1, 2, బాన్సువాడ, కామారెడ్డి డిపోల్లో కార్గో సేవలు మొదలయ్యాయి. రెండేండ్ల కాలంలో ఇప్పటి వరకు 4 లక్షల 80 వేల 446 పార్సిళ్లు, కొరియర్లను గమ్యస్థానాలకు చేర్చారు. వీటి ద్వారా సంస్థకు రూ.4 కోట్ల 92లక్షల 6వేల 676 ఆదాయం సమకూరింది. ఇక కార్గో బస్సుల ద్వారా వచ్చిన ఆదాయం వేరేగా ఉంది. ఆరు డిపోల్లో ప్రత్యేకంగా 1,653 బస్సులను బుక్ చేసుకోగా, వీటి ద్వారా రూ.92లక్షల 15వేల 58 ఆదాయం వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కార్గో, పార్సిల్ సేవలతో పాటు ప్రత్యేకమైన కార్గో బస్సుల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం అక్షరాల రూ.5 కోట్ల 84 లక్షల 21వేల 734 ఉండడం గమనార్హం. నిజామాబాద్ రీజియన్లో నిజామాబాద్ -1 డిపో సత్తా చాటుతున్నది. 3 లక్షలకు పైగా పార్సిల్, కొరియర్ బుకింగ్లతో రూ.3.06 కోట్లు ఆర్జించింది. 62 వేల బుకింగ్లతో కామారెడ్డి డిపో రెండో స్థానంలో నిలిచింది. రూ.60.94 లక్షలు సమకూర్చింది. ఇక 933 కార్గో బస్సుల బుకింగ్లతో కామారెడ్డి డిపో టాప్లో ఉన్నది. వీటి ద్వారా రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. నిజామాబాద్ -2 డిపోలో 605 బస్సుల బుకింగ్ జరుగగా, వాటి ద్వారా రూ.32.84 లక్షల ఆదాయం సమకూరింది.
మెరుగైన ఫలితాలు…
ఆర్టీసీ కార్గోతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. పండుగల సీజన్లో ఆదాయం రెట్టింపు వస్తున్నది. మిగిలిన సమయాల్లోనూ వ్యాపార, వాణిజ్యవర్గాల నుంచి స్పందన బాగుంది. సేవల్లో ఎప్పటికప్పుడు లోపాలను గుర్తించి వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
– ఉషా దేవి, రీజినల్ మేనేజర్, ఆర్టీసీ