తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భీమ్‌గల్‌లో అద్భుతమైన ప్రగతి కనిపిస్తోందన్నారు. స్వరాష్ట్ర సాధనలో సొంత డబ్బులు వేసుకుని టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టిన గడ్డ అని.. అందుకే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పట్టుబట్టి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు వేములతో కలిసి హరీశ్‌రావు శనివారం శంకుస్థాపనలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలో 50 పడకల ఐసీయూ బ్లాక్‌ను ప్రారంభించారు. రోగులతో మాట్లాడిన అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షించారు.
నిజామాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భీమ్‌గల్ :ఉద్యమ కాలంలో భీమ్‌గల్‌లో దుమ్మూదూళీ తప్ప వేరేది కనిపించకపోయేదని, ఇప్పుడు అద్భుతమైన భీమ్‌గల్ కనిపిస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కితాబునిచ్చారు. పల్లెటూరు భీమ్‌గల్ పట్టణంగా మారిందని.. బ్రహ్మాండమైన రోడ్లు, లైట్లు కనిపిస్తున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పట్టుబట్టి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారంటూ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సొంత డబ్బులు వేసుకొని టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టిన గడ్డ ఇదంటూ గుర్తుచేశారు. భీమ్‌గల్ 100 పడకల దవాఖానను వెంటాడి మంజూరు చేయించుకున్నారని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి చేపట్టారు. స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు అయినా… ఈ ప్రాంతంలో ఎవరికైనా ఏమైనా జరిగితే దవాఖానకు పోవాలంటే నిజామాబాద్‌కే వెళ్లేది. ఇప్పుడు ఆర్మూర్, భీమ్‌గల్‌కు స్థానికంగానే వైద్యం చేయించుకునే సౌకర్యం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు.
8-9 నెలల్లోనే భీమ్‌గల్ దవాఖానను పూర్తిచేస్తామని హరీశ్‌రావు మాటిచ్చారు. ఏ ఆపద వచ్చినా ఏడికీ పోవాల్సిన అవసరం లేదని, 40-50 మంది డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యమైన వైద్యం భీమ్‌గల్‌లో అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వచ్చినంకనే నేను పోత బిడ్డా సర్కారు దవాఖానకు అని ప్రజలు అంటున్నారని చెప్పారు. సమైక్య పాలనలో కాన్పులు 35శాతం మాత్రమే సర్కారు దవాఖానల్లో జరిగేవని..ఇప్పుడు 60శాతం జరుగుతున్నాయని, 80శాతం జరగాలన్నదే మా ఆలోచన అంటూ ఆరోగ్య మంత్రి చెప్పారు. భీమ్‌గల్‌లో ఆర్థోపెడిక్ విభాగం, చిన్న పిల్లల వైద్యం కోసం బేబీ కేర్ విభాగం, డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
బీజేపోళ్లను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే..
కాంగ్రెస్, బీజేపోళ్లను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారిని ఈదినట్లేనని హరీశ్ రావు అన్నారు. వారి హామీలకు అడ్డూ అదుపు లేదని, బాండ్ పేపర్ రాసిచ్చినోడు.. మాట తప్పినోడు కూడా ఏదేదో మాట్లాడుతున్నాడని అన్నారు. వాళ్ల మాటలు నమ్ముదామా? 50ఏండ్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తాగే నీళ్లు ఎందుకు తీసుకురాలేదని.. వంద పడకల దవాఖాన ఎందుకు ఇయ్యలేదంటూ ప్రశ్నించారు. బీజేపీ పాలనలో చేసిందేమీ లేదని, రూపాయి విలువ దిగజార్చిందని, సిపాయిల విలువను తగ్గించిందని అన్నారు. డాలర్ రేటు పెరిగి, రూపాయి విలువ తగ్గిందంటూ మండిపడ్డారు. అగ్నిపథ్ తెచ్చి సిపాయి విలువ తగ్గించిన ఘనుడు మోదీ అంటూ దుయ్యబట్టారు.
దేశ రక్షణకు పాటుపడే వారికి ఇకపై పింఛన్ లేకుండా అగ్నిపథ్ తెచ్చిండ్రని చెప్పారు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని నరేంద్ర మోదీ నాశనం చేస్తున్నారని అన్నారు. నల్ల చట్టాలతో రైతులకు ఉరితాళ్లు వేశారని, ఇప్పుడు కాబోయే జవాన్లను రోడ్డుపైకి తెచ్చిండ్రని మండిపడ్డారు. నై జవాన్ నై కిసాన్ తీసుకువచ్చారని తెలిపారు. రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.వేయి రూపాయలు చేసి మహిళల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాయితీ రూ.400 ఉంటే సున్నాకు తీసుకువచ్చి పేద ప్రజలపై మోయలేని భారాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడుతోందని విమర్శించారు. వడ్లు కొనమంటే నూకలు తినమని పరిహాసం ఆడారని, తెలంగాణ ప్రజలను అవమాన పర్చారని గుర్తు చేశారు.
పెద్ద నోట్ల రద్దు సమయంలో 50రోజుల్లో అంతా మారుతుందని చెప్పారని.. ఆరేండ్లు గడిచినా ఏమీ జరగలేదని, నల్లధనం భారీగా పెరిగిందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రణాళికాసంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌తో ఉద్దరిస్తామని చెప్పారని, మిషన్ భగీరథకు రూ.15వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇయ్యమంటే పైసా ఇవ్వలేదని బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. బీజేపీది అంతా ప్రచారం, అపచారమే తప్పా ఉపకారం లేదన్నారు. అలాంటి బీజేపీతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని… నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కవుతాయన్నారు. కాంగ్రెస్‌కు గతం తప్పా వచ్చేది లేదు, సచ్చేది లేదన్నారు.
లిఫ్టులు..ఆనందోత్సవాలు…
ఎస్సారెస్పీకి ఆనుకొని ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో సాగునీటి గోస తీర్చేందుకు ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడు సాధించిన ప్రగతిని వేముల ప్రశాంత్ రెడ్డి గణాంకాలతో వివరించారు. రూ.50కోట్లతో 9 చెక్‌డ్యామ్‌లతో భూగర్భ జలాలు వృద్ధి చెంది భీమ్‌గల్‌లో బోర్లలో నీళ్లు పెరగడానికి కారణమయ్యాయని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు రూ.6కోట్లతో ఉట్నూర్ లిఫ్ట్, రూ.7కోట్లతో బస్సాపూర్ లిఫ్ట్, రూ.3కోట్లతో నాగాపూర్ లిఫ్ట్, రూ.కోటిన్నరతో జలాల్పూర్ లిఫ్ట్, రూ.11కోట్లతో గుమ్మిర్యాల్ లిఫ్ట్, రూ.12కోట్లతో ఆరు గ్రామాలకు పనికొచ్చే పల్లికొండ లిఫ్ట్, రూ.9కోట్లతో గట్టుపొడిచిన ప్రాజెక్టులు వచ్చాయన్నారు. మొత్తంగా సుమారు రూ.100కోట్లతో 10 లిఫ్టులు మంజూరయ్యాయన్నారు.
వేంపల్లి లిఫ్ట్‌లో మ్యానువల్‌గా మోటార్లు తిప్పేదని.. ఆటోమెటిక్ సిస్టమ్ కోసం రూ.3కోట్లు, అక్కడ్నుంచి వేల్పూర్‌లో నవాబ్ చెరువు కోసం రూ.8కోట్లు, నవాబ్ లిఫ్ట్ నుంచి 6గ్రామాలకు సిమెంట్ లైనింగ్ కోసం రూ.8కోట్లు, ఎస్సారెస్పీ ఆధునికీకరణతోపాటు లక్ష్మీ కెనాల్ లైనింగ్ కోసం రూ.13కోట్లతో చౌట్పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్‌కు రోజూ నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. గోదావరి పుష్కరాలకు పోచంపాడ్, తడ్పాకల్లోనే ఘాట్లుండేవని సావెల్, దోంచం ద, గుమ్మిర్యాల్‌లో కొత్త ఘాట్లు ఇవ్వాలని కోరగా కలెక్టర్ రిజెక్ట్ చేస్తే హరీశ్ రావు మనపై ఉన్న ప్రేమతో రూ.6కోట్లతో మూడు ఘాట్లు ఇచ్చిండని చెప్పుకొచ్చారు. రూ.1900కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని కాళేశ్వరం ద్వారా లింక్ చేసుకోవడం ద్వారా ఎస్సారెస్పీ, వరద కాలువ, కాకతీయ కెనాల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయన్నారు.
ప్యాకేజీ 21 నీళ్లు మెయిన్ పైప్లైన్లోకి తీసుకువచ్చి కొన్ని గ్రామాలకు అందిస్తామని మంత్రి వేముల ప్రకటించారు. హరీశ్‌రావు మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వేల్పూర్‌లో రూ.2కోట్లతో కొత్త మార్కెట్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ బిల్డింగ్‌కు రూ.కోటిన్నర, బాల్కొండ నియోజకవర్గంలో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 8 గోదాములకు మంజూరు ఇచ్చారన్నారంటూ వివరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, మార్క్‌ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
రూ.100కోట్లతో అభివృద్ధి..
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
“గతంలో భీమ్‌గల్ బాగా లేకుండేది. మొరీలు, వాసన, దోమలతో అద్వానంగా ఉండేది. ఎట్లా అని నేను, ఎమ్మెల్సీ కవితమ్మతో కలిసి ఆలోచించి భీమ్‌గల్‌ను మున్సిపాలిటీ చేయాలని నిర్ణయించాం. ఇరువురం కలిసి మున్సిపాలిటీని చేయించాం. పురపాలక మంత్రి కేటీఆర్‌ను అడిగిన వెంటనే మున్సిపాలిటీగా ప్రకటించారు. ఆ వెంటనే రూ.25కోట్లు నిధులివ్వడంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. కాలినడకన గల్లీలో తిరిగి ప్రణాళికలు రచించాం. భీమ్‌గల్ పట్టణంలో 90శాతం వసతులు కల్పించాం. మిగిలిన 10శాతం పనులను త్వరలోనే పూర్తిచేస్తాం” అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెండోసారి ఎమ్మెల్యే అయ్యా క ఆర్అండ్బీ శాఖ మంత్రిగా ఉండడం భీమ్‌గల్ అభివృద్ధికి కలిసి వచ్చిందని తెలిపారు.
రూ.2కోట్లతో మూడు చోట్ల శ్మశాన వాటికలు, రూ.3కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, రూ.కోటిన్నరతో పేదల పెండ్లిళ్ల కోసం కల్యాణ మండపాలు, వైద్యారోగ్య శాఖ ద్వారా రూ.35కోట్లతో 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 పడకల దవాఖానకు భీమ్‌గల్‌లో శంకుస్థాపన చేసుకున్నామంటూ చెప్పారు. దాదాపుగా రూ.90కోట్లతో అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతున్నాయన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అంతకన్నా మించిన ఆనందం ఏ నాయకుడికీ ఉండదని.. అ లాంటి తృప్తినే నేను ఈ రోజు పొందుతున్నానంటూ మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.