ఖలీల్‌వాడి, జూన్ 18: వైద్య సిబ్బంది పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో వృద్ధుల కోసం నిర్మించిన 50 పడకల ఐసీయూ బ్లాక్‌ను మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రాంభించారు. అనంతరం దవాఖానలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఒక్కో విభాగం వారీగా సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. లోటుపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని హెచ్చరించారు.
ప్రభుత్వ దవాఖానల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభు త్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. 70 సంవత్సరాల్లో తెలంగాణలో కేవలం నిజామాబాద్ , ఆదిలాబాద్ , వరంగల్ల్లో మాత్రమే మెడికల్ కళాశాల లు ఉన్నాయని.. తెలంగాణ వచ్చిన తరువాత ఏడేండ్లలో 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 780 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ఆ సంఖ్యను 2480కు పెంచుకున్నామని, వచ్చే సంవత్సరానికి 5240 పెరుగుతాయని తెలిపారు. పీజీ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోనూ సీట్ల సంఖ్య రెట్టింపు అయినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ డయోగ్నోస్టిక్ విధానం యావత్ దేవానికి ఆదర్శంగా మారిందని అన్నారు. బస్తీ దవాఖానలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. కాన్పుల్లో తెలంగాణ 99.9 శాతం ప్రగతితో నంబర్ వన్‌గా కొనసాగుతుందన్నారు. వైద్య రంగంలో కేరళ, తమిళనాడు తరువాత తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. మాతాశిశు మరణాల రేటు కుదింపులో తమిళనాడును వెనక్కి నెట్టి తెలంగాణ ముందంజలో ఉందన్నారు. వైద్యశాఖలో అనేక విభాగాల్లో పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. గైనిక్ విభాగంలో రూ.408 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇంతలా కృషి చేస్తున్నా లోపాలు, అలసత్వాల కారణంగా వైద్యాశాఖకు చెడ్డ పేరు వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులను బయటికి పంపకూడదన్నారు. కేవలం మందులకోసమే ప్రభుత్వం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. 700 రకాల మందులను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంత ఎక్కువగా వైద్యసేవలు అందిస్తే దవాఖానకు అంత ఎక్కువ ఆదా య వనరులు సమకూరుతాయన్నారు. గాంధీ, నిలోఫర్ దవాఖానలో నెలకు రెండు కోట్లు ఆర్జిస్తున్నారని తెలిపారు. ఈ నిధులు పూర్తిగా దవాఖానల అభివృద్ధికి వెచ్చించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. పరికరాలు చెడిపోతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కాన్పుల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులను బయటికి పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
త్వరలోనే 13వేల వైద్యుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. దవాఖానలో మోకాలి చిప్ప మార్పిడి చికి త్స చేయడంపై సిబ్బందిని అభినందించారు. సమా వేశంలో రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, నగర మేయర్ దండు నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్, కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, దవాఖాన సూపరిం టెండెంట్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.