బాన్సువాడ, జూన్ 18: రాష్ట్రంలోని రైతులకు ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి అందిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎల్లవేళలా సాగునీటి కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. బాన్సువాడ పట్టణంలోని చింతల్ నాగరాం శివారులో రూ. 15 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యామ్ నిర్మాణం పూర్తికావడంతో శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఏకైక సౌకర్యం గోదావరి, కృష్ణా నదులు మాత్రమేనని, ఇవే ఉత్తర,దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కావడానికి దోహదపడుతున్నాయన్నారు. జనవనరుల సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా 45 ఏండ్లుగా గోదావరి నది నీరు ధవళేశ్వరం ద్వారా ఏడాదికి 1600 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు.
ఆ నీరు వృథాగా పోకుండా రైతుల బీడు భూ ములకు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. వందలాది టీఎంసీల నీటి వృథాను అరికట్టేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని వివిధ జిల్లాలకు తరలించేలా నిజాంసాగర్‌కు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా , సింగూర్ ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ కాలువ ద్వారా,శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్ పునరుజ్జీవం పథకం ద్వారా అందించేలా చర్యలు చేపట్టారని వివరించారు. రిజర్వాయర్ కింద ఉన్న రైతులకు సాగు, తాగునీరు కొరత లేకుండా నీటిని అందించేలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్‌కు వచ్చే కాలువ పనులు 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు.
కాలువ నుంచి హల్దివాగు ద్వారా ప్రతిరోజూ అర టీఎంసీ నీళ్లు నిజాంసాగర్‌కు వస్తాయన్నారు. నిజాంసాగర్‌కు నీళ్లు ఎప్పుడైతే పుష్కలంగా వస్తాయో, ప్రాజెక్టు లీకేజీ వాటర్ కిందికి వెళ్లి ఎస్సీరెస్పీ ద్వారా సముద్రంలోకి పోతున్నాయన్నారు. ఈ నీటిని కూడా వృథాగా పోనివ్వకుండా మంజీర పొడువునా చెక్ డ్యాం నిర్మించడంతో మంజీరాకు ఇరుపక్కల ఉన్న రైతుల భూములకు మేలు చేకూరేలా నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. లిప్టు, మోటర్లు, బోరుబావుల ద్వా రా నీరు తీసుకొని వేలాది ఎకరాల్లో పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు. ఆయకట్టు కాని ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లేలా సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని అన్నారు.
బాన్సువాడ చింతల్ నాగారాం శివారులో ఒక చెక్‌డ్యాం, గుండెనెమ్లి, కిష్టాపూర్, బీర్కూర్ , కొడిచెర, సుంకిని దగ్గర చెక్‌డ్యాములు నిర్మిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా 365 రోజులూ మంజీరా నది జీవించి ఉం టుందని అన్నారు. చెక్‌డ్యాములు నిర్మించి రైతులకు సాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు చెప్పారు. చింతల్ నాగారాం శివారులో చెక్ డ్యాం నిర్మాణ పనులు పూర్తయినట్లు తెలిపారు. బీర్కూర్ చెక్‌డ్యాం వద్ద 20 నుంచి 30 ఫీట్ల వరకు ఇసుక ఉం దని, అక్కడ నిర్మాణం కోసం సాంకేతిక నిపుణుల ద్వారా ఆలోచన చేయనున్నట్లు చెప్పారు. బీర్కూర్‌లో బ్యారేజి నిర్మించి జుక్కల్ నియోజక వర్గంలోని మద్నూ ర్ మండలంలోని రైతుల పంటపొలాలకు లిప్టు ద్వారా సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో నీటి కొరత లేదన్నారు. సీఎం కేసీఆర్ అయ్యా క మొదట గోదావరిపై సర్వే చేయించి, హెలికాప్టర్ ద్వారా తానే స్వయంగా తిరిగి సాగునీటి వనరులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పాత ఆయకట్టు కింద ఉన్న 20 నుంచి 25 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగడమే కాకుండా, మరోకొత్త ఆయకట్టు 30 లక్షల ఎకరాలకు వివిధ పద్ధతులద్వారా నీరు అందించబోతున్నామని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొంతభాగం అంచెల వారీగా నీటిని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం పట్టణంలోని తాడ్కోల్ శివారులో నిర్మించిన డబుల్‌బెడ్ కాలనీలో పర్యటించారు. కాలనీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్పీకర్ పరిశీలించారు.