బాన్సువాడ టౌన్, జూన్ 18: బాన్సువాడ పట్టణ పరిధిలోని వినాయకనగర్‌లో వనం సాయిలు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టిక్ ట్యాంకు వాహనాల వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో బాన్సువాడకు చెందిన వనం సాయిలు, రామకృష్ణ మధ్య నెలకొన్న గొడవ హత్యకు దారితీసింది. వనం సాయిలు(36) శుక్రవారం రాత్రి పాత బాన్సువాడ వినాయకనగర్‌లో సెప్టిక్ ట్యాంకును ఖాళీ చేయడానికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ తన బంధువులతో కలిసి వెళ్లి సాయిలును కత్తితో దారుణంగా హత్య చేశాడు. వనం సాయిలు భార్య వనం వాణి ఫిర్యాదు మేరకు నిందితుడు రామకృష్ణతోపాటు ఆయనకు సహకరించిన 8 మంది బంధువులపై రౌడీ షీట్ తెరిచామని డీఎస్సీ తెలిపారు.
కేసును త్వరగా చేధిస్తామని నిందితులను పట్టుకొని శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. నిందితులను త్వరగా పట్టుకొని శిక్ష పడేలా చేయాలని మృతుడి కుటుంబీకులు శనివారం ఉదయం పోలీసు స్టేషన్‌కు సమీపంలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితులను గమనించిన డీఎస్పీ జైపాల్ రెడ్డి, టౌన్‌సీఐ రాజశేకర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది మృతుడి కుటుంబ సభ్యులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.