కామారెడ్డి/విద్యానగర్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా కార్పొరేట్‌కు దీటుగా అన్ని పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించింది. మరోవైపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. కామారెడ్డి జిల్లాకు 6.20 లక్షల పుస్తకాలు అవసరం ఉన్నాయి. మొదటి విడుతగా జిల్లాకు 2.50 లక్షల పుస్తకాలు చేరుకున్నాయి. ఈ నెలాఖరు వరకు వందశాతం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ద్విభాషతో పాటు ఒకే భాషతో పుస్తకాలను సిద్ధం ఒకే పుస్తకంలో తెలుగుతో పాటు ఇంగ్లిష్ మాధ్యమంలో పాఠాలు పొందుపర్చారు. మండలాల వారీగా ఇప్పటికే ఎమ్మార్సీ కార్యాలయాలకు మొదటి విడుత పుస్తకాలు చేరాయి.
గతానికి భిన్నంగా ఈ ఏడాది మన ఊరు-మన బడిలో భాగంగా 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సమాంతరంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన తప్పనిసరి చేయడంతో పాఠ్యపుస్తకాలను ద్విభాషా పద్ధతిలో ముద్రించారు. దీంతో ముద్రణలో కొంత ఆలస్యం జరిగినా కరీకులం ఆధారంగా ఎప్పటికప్పుడు రెండు, మూడు విడుతల్లో పుస్తకాల పంపిణీ చేపడుతున్నారు.
కోడ్ ఆధారంగా పుస్తకాల పంపిణీ
పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టింది. ప్రతి పుస్తకానికి క్యూఆర్ కోడ్ ముద్రించి ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరవేశారు. అక్కడి నుంచి కోడ్ నంబర్ల ఆధారంగా విద్యార్థులకు పంపిణీ చేయబోతున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఒకవేళ పక్కదారిపట్టినా కోడ్ ఆధారంగా విషయం బట్టబయలు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలు ముద్రించి అమ్మేందుకు అవకాశం ఇచ్చారు.
మండలాల వారీగాపంపిణీ..
జిల్లాలో 697 ప్రాథమిక పాఠశాలలు, 127 ప్రాథమికోన్నత పాఠశాలలు, 181 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మొత్తం 1011 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 73,963 బాలురు, 71,480 మంది బాలికలు మొత్తం సుమారు 95,000 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరికి 6 లక్షల 30 వేల పుస్తకాలు అవసరం ఉండగా 2 లక్షల 50 వేల పుస్తకాలు గోదాముకు చేరుకున్నాయి. సుమారు 40 శాతం పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ఇంకా 3 లక్షల 80 వేలు పుస్తకాలు రావాల్సి ఉంది. ఈనెల 25వ తేదీ తర్వాత విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని విద్యాశాఖ భావిస్తుంది.