ఆర్మూర్, జూన్ 18 : వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేయడానికి నల్ల చట్టాలు తెచ్చి దేశానికి అన్నం పెట్టే రైతుల బతుకులను రోడ్లపాలు చేసిన బీజేపీ.. ఇప్పుడు అగ్నిపథ్ అనే ఓ అనాలోచిత నిర్ణయంతో దేశాన్ని రక్షించే జవాన్ల బతుకులను భక్షిస్తుందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సైనిక బలగాల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ దేశ యువతను ఆందోళనకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 46 వేల మందిని 90 రోజుల్లో నియమించడం, కేవలం రూ.30 వేల వేతనం నిర్ణయించడం అర్థరహితమన్నారు. దేశ భద్రత విషయంలో ఇంత బాధ్యత లేని తనం మంచిది కాదన్నారు. 10వ తరగతి పాసైన వారు అగ్నిపథ్‌లో చేరి తిరిగి వెళ్లేటప్పుడు 12వ తరగతి పాసైన సర్టిఫికెట్ ఇస్తామనడం సిగ్గుచేటని జీవన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. బీజేపీ పాపం పండుతోందని, ఆ పార్టీని దేశ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుంచి 7.83 శాతానికి పెరిగిందని, మోదీ ప్రభుత్వానికి పాలన చేతకాదని మండిపడ్డారు. మోదీది అంతా మోసపూరిత పాలన అని.. దేశ ప్రజలు, యువత మేల్కోవాలని విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయన్నారు. యువత ఆగ్రహాన్ని గమనించయినా కేంద్రం తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరసన తెలుపుతున్న యువతపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పులలో ఒకరు మరణించడం, కొందరు గాయపడటం బాధాకరమన్న జీవన్‌రెడ్డి.. మృతుడి కుటుంబంతో పాటు గాయపడిన వారికి కేంద్రం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.