సైనిక నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ‘అగ్నిపథ్’పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రిక్రూట్మెంట్ విధానం సరిగా లేదని, పాత విధానాన్నే కొనసాగించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. కేంద్ర నిర్ణయంపై దేశ వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో నిరసనలు పెల్లుబికాయి. మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. భరతమాతకు సేవ చేయాలనే అంకుఠితదీక్షతో సైనికులుగా మారాలనే ఆశతో ఉన్న వాళ్లలో ఆందోళన వ్యక్తమవుతున్నది. సైనిక రిక్రూట్మెంట్లకు మంగళం పాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. రెండేండ్లుగా వేయి కండ్లతో ఎదురుచూస్తున్న యువతకు ఆశనిపాతంలా మారింది. దీంతో ఉద్యోగార్థులు ఆందోళనకు దిగుతు న్నారు. నిన్న ఉత్తరాదిలో, నేడు దక్షిణాదిలో అది కూడా సికింద్రాబాద్ వేదికగా సైనిక ఉద్యోగార్థులు నిరసనలతో కదం తొక్కారు. రక్షణశాఖలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానంపై ఉత్తరాదిలో అగ్గి మంటలు అంటుకోగా… శుక్రవారం సికింద్రాబాద్‌లోనూ విధ్వంసం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న జాతి వ్యతిరేక విధానాలకు విసిగి వేసారిన యువత.. సైనిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ సర్కారుకు గట్టి సందేశాన్ని ఇచ్చింది.
శాశ్వత ప్రాతిపదికకు మంగళం…
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల సేవలు వెల కట్టలేనివి. ఎండా, వాన, చలి తేడా లేకుండా సరిహద్దులో ప్రాణాలకు తెగించి ఉగ్రమూకలతో కొట్లాడే సైనికులకు స్వతంత్ర భారతదేశంలో ఎనలేని గౌరవం దక్కింది. రిక్రూట్మెంట్ స్థాయి నుంచి రిటైర్మెంట్ వరకు వారికిచ్చే ప్రయోజనాలు అంతంత మాత్రమే అయినప్పటికీ ఇప్పటి వరకు పాలించిన పాలకులు రాజీపడకుండా సైనికులకు, మాజీ సైనికులకు సేవలు అందించారు. ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తూ వారిని దేశరక్షణలో భాగం చేశారు. కానీ మోదీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతోనే దేశ రక్షణ వ్యవస్థ ప్రమాదంలో పడగా.. సైనికులుగా మారాలనుకుంటున్న అనేక మంది యువత ఆలోచనలపై నీళ్లు చల్లే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఇందుకు కొత్తగా అగ్నిపథ్ పేరుతో తీసుకు వచ్చిన రిక్రూట్మెంట్ విధానమే సాక్ష్యంగా నిలుస్తున్నది. కేవలం వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే ప్రధాన లక్ష్యంగా త్రివిధ దళాల్లో శాశ్వత ప్రాతిపదికన చేపట్టే నియామకాలకు బీజేపీ సర్కారు మంగళం పాడింది. దీని స్థానంలో నాలుగేండ్ల కాల పరిమితితో ఉండే సర్వీసును తీసుకురావడం వివాదాస్పదం అవుతున్నది. 17.5 ఏండ్ల నుంచి 21 ఏండ్ల వయసు వారికి మాత్రమే కల్పించే ఈ అవకాశాలను యువత తీవ్రంగా తప్పు పడుతున్నది.
ప్రయోజనాలు శూన్యం..
ప్రాణాలకు తెగించి కొట్లాడే అగ్నిపథ్‌లోని సైనికులను కేంద్రం కేవలం కిరాయి మనుషులుగానే లెక్కిస్తున్నది. ఎక్కడా వారి సేవలకు విలువ ఇవ్వకపోవడమే తీవ్రమైన అభ్యంతరాలకు స్థానం ఇచ్చినట్లు అయ్యింది. జనరల్ ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా చేరిన వారిని ఆర్మీలో 17ఏండ్ల పాటు కొనసాగిస్తారు. రిటైర్ అయ్యాక పింఛన్ ఇస్తున్నారు. అగ్నిపథ్‌లోని అగ్నివీరులకు పింఛన్ కట్ చేస్తున్నారు. వేతనాలు, ర్యాంకులను భారీగా తగ్గిస్తున్నారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే సాయుధ బలగాలను ఆర్థిక దృక్కోణంలో చూడడం ఏంటంటూ యువత మోదీ సర్కారును ప్రశ్నిస్తున్నది. అగ్నిపథ్‌ను తీసుకొచ్చిన కేంద్రం భవిష్యత్తులో జనరల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడంతో వారంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కఠోర శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత అగ్నిపథ్‌లో నాలుగేండ్ల తర్వాత మళ్లీ తుది పరీక్ష నిర్వహించడంపైనా అనేక సందేహాలు కలుగుతున్నాయి.
బీజేపీ కుసంస్కారం…
అగ్నిపథ్ సైనిక నియామకాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీలకతీతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంతో తలలు పట్టుకుంటున్న నరేంద్రమోదీ ప్రభుత్వం ఏమీ చేయలేక తనదైన శైలిలో దుష్ప్రచారానికి తెర లేపింది. ముందు నుంచి విద్వేషాలను రెచ్చగొట్టడంలో ఆరితేరిన కాషాయ పార్టీ సోషల్ మీడియా వింగ్‌ను ఉసిగొలిపి ఉద్యోగార్థులపై విషం చిమ్ముతున్నది. వీరికి సంఘ విద్రోహ శక్తులు, పలు రాజకీయ పార్టీలతో అంటకాగినట్లుగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో విషపు రాతలు రాసి జనాల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారు. వాస్తవాలను మరుగునపడేసి ప్రజల ఆలోచనలను మార్చేలా బీజేపీ సోషల్ మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచే విషంకక్కడం మొదలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సికింద్రాబాద్ ఆందోళనలో పాల్గొన్న యువత అంతా కూడా దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వచ్చిన వారేనని.. వారంతా నిజమైన భరతమాత బిడ్డలంటూ సామాన్యులు కీర్తిస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చి యావత్ జాతికి క్షమాపణలు కోరిన ప్రధాని నరేంద్ర మోదీ.. త్వరలోనే అగ్నిపథ్ వ్యవహారంలోనూ ఇదే తీరులో క్షమాపణలు కోరడం ఖాయమంటూ పలువురు మేధావులు పేర్కొంటున్నారు.
అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలి..
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను వెంటనే రద్దు చేయాలి. ఈ విధానంపై యువత భగ్గుమంటున్నది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో యువకులు గాయపడిన సంఘటన బాధాకరం. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
-గైని సంపత్, టీయూ టీఆర్ఎస్వీ
ఆర్మీని రాజకీయ లబ్ధికి వాడుకుంటుంది..
దేశాన్ని రక్షించే ఆర్మీని సైతం కేంద్రం రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నది. రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆర్మీ నోటిఫికేషన్‌ను ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఇప్పుడు అగ్నిపథ్ పేరున కొత్తగా రిక్రూట్మెంట్ తీసుకొచ్చి అభ్యర్థులను గందరగోళంలో పడేసింది. దేశవ్యాప్తంగా పలువురు యువత మరణానికి బీజేపీ ప్రభుత్వం కారణమైంది.
– తుమ్మల జ్ఞానేశ్వర్, ఇందల్వాయి
దేశ రక్షణకు ప్రమాదం…
అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ సరైంది కాదు. ఇలాంటి విధానంతో దేశరక్షణకు ఎంతో ప్రమాదం. కేంద్రం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటనకు బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
– వి.సాయినాథ్, పీవైఎల్ డివిజన్ అధ్యక్షుడు
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
బోధన్ రూరల్, జూన్ 17:కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌తో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. వెంటనే దానిని రద్దు చేయాలి.యువతకు ఉపాధి కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టాలి. త్రివిధ దళాలకు సంబంధించి సవరణలు చేయకుండా పాతపద్ధతిలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్వహించాలి.
– ఆర్. రవిదాస్ నాయక్, రాజీవ్‌నగర్ తండా
కేంద్రం తీరుతోనే ఆందోళనలు
కేంద్రం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న అగ్నిపథ్ పథకంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. జరిగే ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతోనే యువకులు బలి అవుతున్నారు. యువకులకు మేలు చేసేలా కేంద్రం పథకాన్ని సవరించాలి.
– సంతోష్, యువకుడు, కల్దుర్కి
బీజేపీ బాధ్యత వహించాలి
అర్థం పర్థం లేని పథకాలు రూపొందిస్తూ యువతతో ఆటలాడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం కారణంగానే నిరుద్యోగుల కడుపు మండి అల్లర్లకు పాల్పడ్డారు. దీనికి పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే వహించాలి. యువత జీవితాలతో ఆటలాడుకునేలా మోదీ పథకాలు చేపట్టడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం వెంటనే పథకాన్ని రద్దు చేయాలి.
-సోమశేఖర్,యువకుడు మైలారం
విధానాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది..
ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. పటిష్టమైన ఆర్మీ రిక్రూట్మెంట్ వ్యవస్థను బలహీనపర్చేలా ఉన్న ‘అగ్నిపథ్’ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి.. యువత జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చేలా ఉన్న పథకాలు ప్రవేశపెట్టేముందు ప్రభుత్వం ఆలోచించాలి.
-రవికాంత్, నిరుద్యోగ యువకుడు, ధర్పల్లి
అనాలోచిత నిర్ణయం..
ఆర్మీలో చేరి దేశ సేవ చేసుకోవచ్చని ఎం తో శ్రమపడిన యువత భవిష్యత్తును అఘాతంలోకి తోసేలా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం తేవడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణ యం.
-విక్రమ్‌రెడ్డి, యువకుడు మైలారం
పూర్తి బాధ్యత కేంద్రానిదే..
అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ విధానం సక్రమంగా లేదు. దాన్ని తక్షణమే విరమించుకోవాలని ఆందోళనకు దిగిన యువకులపై లాఠీచార్జి, కాల్పులు జరపడం బాధాకరం. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గాయపడిన వారిని ఆదుకోవాలి.
– నరేశ్ గౌడ్, పోచారం
ఇద్దరికి గాయాలు..
కామారెడ్డి / నిజాంసాగర్, జూన్ 17: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళనలో నిజాంసాగర్ మండలానికి చెందిన ఇద్దరు ఆర్మీ అభ్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన పరశురాం(20), నర్వ గ్రామానికి చెందిన పెంటబోయిన మోహన్(22) గాయపడగా, ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కాగా పరశురాం తండ్రి గాండ్ల శంకరయ్య, మోహన్ తండ్రి నాగయ్య వ్యవసాయం చేస్తుంటారు.