కామారెడ్డి, జూన్ 16 : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సా గుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు దేశంలోనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన పనులు, మంజూరైన నిధుల వివరాలు సేకరించి నివేదికలు రూపొందించి గ్రామ పంచాయతీ గోడలపై రాయడంతో పాటు గ్రామ ముఖ్య కూడళ్లలో ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సర్క్యులర్ జారీ చేయడంతో నిధుల వివరాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని 526 గ్రామ పంచాయతీల్లో బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
పల్లె ప్రగతితో మార్పులు…
రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో మార్పు వచ్చింది. గతంలో నిధుల కొరతతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పేరుకుపోయిన సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నది. ఇందుకోసం గ్రామ పంచాయతీకి నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నది. ఈ నిధులకు తోడు గ్రామ పంచాయతీకి వివిధ రూపాల్లో పన్నులు రావడంతో పల్లెల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.97కోట్ల98లక్షల నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేశారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో 678 పల్లె ప్రకృతి వనాలు, 526 కంపోస్టు షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణం పూర్తయ్యింది. బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం 22 మండలాల్లో 220 ఎకరాలు గుర్తించారు. మినీ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం 22 మండల్లాలోని 88 గ్రామాల్లో 440 ఎకరాలు గుర్తించారు.
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి…
పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి పనులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2014 సెప్టెంబర్లో ప్రారంభించిన పల్లెప్రగతి ద్వారా ఇప్పటి వరకు ఆయా గ్రామాలకు విడుదలైన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, రైతు వేదికలు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా ఇచ్చిన నల్లా కనెక్షన్లు, విద్యుత్ స్తంభాల మార్పిడి, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను పంచాయతీ కార్యదర్శులు సేకరించారు. సేకరించిన వివరాలను గ్రామ పంచాయతీ గోడలకు నల్లటి రంగు వేసి తెలుపు రంగుతో రాయించడంతో పాటు గ్రామంలో ముఖ్యమైన కూడళ్ల వద్ద ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు రాయించి ఏర్పాటు చేశారు. గ్రామంలో గత నాలుగు విడుతలుగా పల్లె ప్రగతిలో జరిగిన పనుల వివరాలను ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకుప్రగతి నివేదిక…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి నివేదిక బోర్డులు ఏర్పాటు చేశాం. పంచాయతీ కార్యాలయం గోడలతో పాటు గ్రామాల్లోని ముఖ్యమైన కూడళ్ల వద్ద రెండు, మూడు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా గ్రామాలకు ఇప్పటి వరకు జరిగిన పనులు, మంజూరైన పనులు, ఖర్చు చేసిన వివరాలను ఈ నివేదికలో పొందుపరిచాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు పొందుపర్చడం ద్వారా జరిగిన అభివృద్ధి గ్రామస్తులందరికీ తెలుస్తుంది.
-శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీ అధికారి, కామారెడ్డి