బాన్సువాడ రూరల్, జూన్ 16 : బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇండ్ల బాలరాజు (58) దారుణ హత్యకు గురయ్యాడు.ఈ ఘటనకు సంబంధించి గురువారం డీఎస్పీ జైపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలరాజు పంచాయతీలో వాటర్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం రాత్రి 12 గంటల వరకు ఇంటి వద్దే ఉన్న ఆయన గురువారం ఉదయం గ్రామ శివారులోని కంపోస్ట్ షెడ్డు వద్ద శవమై కనిపించాడు. ఈ విషయమై గ్రామ సర్పంచ్.. పోలీసులకు సమాచారం అందించగా వారి ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గురైన వ్యక్తి బాలరాజుగా గుర్తించారు. కంపోస్ట్ షెడ్డు వద్ద మృతుడి చేతులు కట్టేసి గొంతు కోసి, శరీరంపై అక్కడక్కడా పొడిచి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
నిందితులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని, క్లూస్ టీమ్‌ను రప్పించామని చెప్పారు. గ్రామంలోని సీసీ కెమెరాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి హత్య చేసిన నిందితులను పట్టుకుంటామన్నారు. మృతుడి భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. శవ పంచానమా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించామని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నట్లు తెలిపారు. డీఎస్పీ వెంట సీఐ రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.