బీబీపేట్, జూన్ 16: జన్మనిచ్చిన ఊరు.. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ప్రతి ఒక్కరి జీవితంపై చెరగని ముద్ర వేస్తాయి. బుద్ధి నేర్పిన బడి రుణం తీర్చుకునేందుకు ముందుకు వచ్చే దాతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం దిశానిర్ధేశం చేయనున్నది. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తెలుగు మీడియానికి సమానంగా ప్రభుత్వబడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనున్నారు. సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలకు దాతలు తోడైతే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఇందుకు కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ పాఠశాలే నిదర్శనం. గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి వేణుగోపాల్‌రెడ్డి తనకు విద్యాబుద్ధులు నేర్పడిన పాఠశాలను రూ. 78 లక్షలు వెచ్చించి పునర్నిర్మించారు.
రూ.60 లక్షలతో మరో ఆరు గదుల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. పాఠశాలల్లో మెరుగైన వసతులతో పాటు కార్పొరేట్ తరహాలో విద్య నందించి ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను మార్చాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు చిరునామాగా నిలుస్తున్నారు పలువురు దాతలు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారింది బీబీపేట్ మండలంలోని జనగామ పాథ్రమికోన్నత పాఠశాల. జనగామ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. దీంతో అదే గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి వేణుగోపాల్‌రెడ్డి తాను చదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో సొంత ఖర్చులతో 8 గదులతో కార్పొరేట్ స్థాయిలో భవన నముదాయాన్ని నిర్మించారు. పాఠశాలలో 140 నుంచి 193 మంది విద్యార్థుల సంఖ్య పెరుగడంతో రూ.60 లక్షలతో మరో 6 గదులను నిర్మించడానికి ముందుకు వచ్చి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించాలి..
ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్య అందాలి. అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల చదువుకు ఇబ్బంది ఉండదు. చదివిన పాఠశాల రుణం తీర్చుకోవాలని, అందరికీ విద్యనందించాలని శిథిలావస్థలో ఉన్న పాఠశాలను ఎనిమిది గదులతో సముదాయం నిర్మించాం. విద్యార్థులు సంఖ్య కూడా పెరుగడంతో మరో 6 గదుల నిర్మాణ పనులు చేపడుతున్నాం.
-తిమ్మయ్యగారి వేణుగోపాల్‌రెడ్డి, దాత, జనగామ
ఊరికి సేవ చేయడం అభినందనీయం..
గుడికన్నా బడికి సేవ చేస్తే పుణ్యం దక్కుతుంది. పాఠశాల భవనాన్ని పునర్నిర్మించిన తిమ్మయ్యగారి వేణుగోపాల్‌రెడ్డికి జనగామ గ్రామ ప్రజలు రుణపడి ఉంటాం. గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం రూ.78 లక్షలు, విద్యార్థులు పెరుగడంతో మరో 6 గదుల నిర్మాణం కోసం రూ. 60 లక్షలు, గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ. 4.50 కోట్లతో పనులు చేయించిన వేణుగోపాల్‌రెడ్డి గ్రామంలో ఉండడం మా అదృష్టం.
– పాత రాజు, జనగామ సర్పంచ్