కమ్మర్పల్లి, జూన్ 16 : రైతు సంక్షేమం కోసం రైతుగా ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంతి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. బాల్కొండ నియోజక వర్గంలో రూ.149. 66 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ ఎత్తి పోతల డిజైన్ల పై గురువారం రాత్రి వేల్పూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిజైన్ ప్లాన్లను మంత్రి పరిశీలించారు. శ్రీరాం సాగర్‌లో కనీస నీటి మట్టం ఉన్న సమయంలోనూ పంపింగ్ చేసుకునేలా డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎత్తిపోతల నుంచి సుర్బిర్యాల్, ఫత్తేపూర్, చిట్టాపూర్ గ్రామాల ఆయకట్టుకు పైపు లైన్లు, డిస్ట్రిబ్యూటరీ చాంబర్లు విడి విడిగా ఉండాలని సూచించారు.
సాగు నీరందించే సమయంలో ఆయా గ్రామాల మధ్య తగాదాలు చోటుచేసుకోకుండా వేర్వేరుగా పైపు లైన్లు, కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆయకట్టు రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎస్సారెస్పీలో నీటి మట్టం 1020 మీటర్లు ఉండగా నీటిని ఎత్తి పోసుకునేలా డిజైన్లు ఉండాలని సూచించారు. ఈ ఎత్తిపోతల ద్వారా బాల్కొండ నియోజక వర్గంలోని బాల్కొండ, చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాలకు చెందిన సుమారు 3, 500 ఎకరాలకు సాగు నీరు అందనున్నదని మంత్రి తెలిపారు. రికార్డు స్థాయిలో కేసీఆర్ నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూసి ప్రపంచమే అబ్బుర పడుతోందన్నారు. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమన్నారు. మన రాష్ట్రంలో బీడు భూములు లేకుండా పచ్చని పైరులతో కళకళలాడాలనే కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అధికారులు నిబద్ధతతో పని చేయాలని కోరారు. రైతులు, పేదలు కేంద్రంగా సాగుతున్న కేసీఆర్ పాలనను అన్ని రాష్ర్టాల ప్రజలు గమనిస్తున్నారన్నారు. అందుకే దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదన్నారు. సమావేశంలో ఎస్ఈ యశశ్వి, ఈఈలు భాను ప్రకాశ్, వెంకట రమణ, డీఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
నేడు శెట్పల్లికి మంత్రి వేముల
బాల్కొండ, జూన్ 16: మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. రూ. 46 లక్షలతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.