ఇందూరు, జూన్ 16 : జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సహస్ర జ్ఞాపకశక్తిలో అరుదైన రికార్డు సాధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను అతి తక్కువ సమయంలో అనర్గళంగా చెప్పి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించుకుంది. నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన గాయత్రి దవాఖాన డాక్టర్ చిట్టిమిల్ల సంతోష్‌కుమార్ – అర్చన దంపతుల కూతురు సహస్ర స్థానిక ప్రెసిడెన్సి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ది. పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సహస్ర రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పేర్లను అత్యల్ప సమయంలో చెప్పి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. గురువారం ప్రెసిడెన్సీ పాఠశాలలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు రామ్మోహన్‌రెడ్డి, సంతోష్, పాఠశాల చైర్పర్సన్ శమంత, ప్రిన్సిపాల్ పవన్, పాఠశాల ఇన్చార్జి కృపానిధి, సహస్ర తల్లిదండ్రుల సమక్షంలో టాలెంట్ పరీక్షను నిర్వహించారు. రాజ్యాంగంలోని 40 ఆర్టికల్స్‌ను రెండు నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించిందని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. సహస్రలో ఉన్న జ్ఞాపక శక్తిని గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించారని పాఠశాల సిబ్బంది తెలిపారు. సహస్ర ఇప్పటికే పలు రికార్డులు సాధించింది. 2018లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, 2018 తెలుగు సూపర్ కిడ్ రికార్డు, 2019 తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, 2019 ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, 2022లో ఆషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకోవడం విశేషం.