ఇందూరు, జూన్ 16 : పల్లెప్రగతి కార్యక్రమం పూర్తయ్యే నాటికి అన్ని గ్రామపంచాయతీల పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌కో అధికారులు, ఎంపీవోలతో గురువారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతిపై మండల పంచాయతీ అధికారులు, ట్రాన్స్‌కో ఏఈలు అలసత్వ ధోరణిని వీడి పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా విద్యుత్ సమస్యలపైనే తమకు ఫిర్యాదులు చేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతోపాటు వంగిన స్తంభాలను వెంటనే సరిచేయాలని సూచించారు.
ఎక్కడ కూడా వేలాడుతున్న విద్యుత్ వైర్లు ఉండకూడదన్నారు. ఎంపీవోలు క్షేత్రస్థాయిలో విద్యుత్‌శాఖ ఏఈలను సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తిచేయించాలని ఆదేశించారు. ఈనెల 18వ తేదీ నాటికి ఏ ఒక్క పనీ పెండింగ్‌లో ఉంచవద్దన్నారు. విధులను నిర్ల క్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోనూ కంపోస్ట్ షెడ్లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఎరువు తయారు చేయాలని, తద్వా రా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. పల్లెప్రగతి ముగిసిన అనంతరం పనులు పెండింగ్‌లో ఉంటే ఉపేక్షించేది లేదని, సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీవో జయసుధ, ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్.రవీందర్, ఏడీఈ తోట రాజశేఖర్, ఆయా మండలాల ఏఈలు, ఎంపీవోలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.