రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు, సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణలో గుణాత్మక మార్పులు వచ్చాయి. పరిపాలనా వికేంద్రీకరణతో మెరుగైన సేవలు ప్రజలకు చేరువయ్యాయి. అభివృద్ధి ఫలాలు ఇంటింటికీ చేరుతున్నాయి. అభివృద్ధి విస్తరణకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని రాష్ట్ర నలుమూలలా విస్తరించేందుకు బాటలు వేసింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోనూ ఐటీ టవర్ నెలకొల్పుతున్నది. వివిధ కంపెనీలను ఇక్కడికి రప్పించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నగరం నడిబొడ్డున ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నది. రూ.50 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా చొరవతో పలు కంపెనీలు నిజామాబాద్ ఐటీ టవర్‌పై ఆసక్తి చూపుతున్నాయి. ఈ భవనం సిద్ధం కాగానే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి.
నిజామాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నది. మల్టీ నేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్యవాదులు సృష్టించిన అపవాదులన్నీ పటాపంచలు అయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఐటీ కంపెనీలు వెనక్కి వెళ్లిపోతాయనే భయోత్పాతం నుంచి ఇక్కడి సంస్థలు తమ కార్యకలాపాలను పెంచుకుంటున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఐటీ సెక్టార్ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలకు సైతం విస్తరిస్తున్నాయి. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కృషితో భాగ్యనగరానికి ఐటీ ఇమేజ్ రెట్టింపు అవుతున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్ మంజూరు చేయగా పనులు చకచకా జరుగుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ టవర్ సేవలు ప్రారంభం కాగా త్వరలోనే ని జామాబాద్లోనూ ప్రారంభానికి సిద్ధం కావడంతో ఈ ప్రాంత ఐటీ నిపుణుల్లో ఆసక్తి పెంచుతున్నది.
దశల వారీగా బిగాల సమావేశాలు…
నిజామాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న ఐటీ టవర్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమంగా నిలిపేందుకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఐటీ టవర్ శంకుస్థాపన సమయంలోనే అమెరికాలోని ప్రము ఖ కంపెనీలతో చర్చలు జరిపారు. బిగాల సోదరుడు మహేశ్ గుప్తా సహకారంతో పలు సంస్థలతో ఎంవోయూ సైతం కుదుర్చుకున్నారు. ఒప్పందాల మేరకు త్వరలోనే ఆయా కంపెనీలు నిజామాబాద్‌లో తమ సంస్థ కార్యకలాపాల కోసం ముహూర్తాలు ఖరారు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. వారం రోజుల క్రితం తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న టాస్క్ విభాగం బాధ్యులతోనూ బిగాల గణేశ్ గుప్తా సమావేశమై స్కిల్ మేనేజ్మెంట్పై చర్చించారు. వృత్తి నిపుణుల లభ్యత, ఐటీ కంపెనీలకు మానవ వనరుల విషయాలపై చర్చించారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ముందే గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడంలో ఎమ్మెల్యే బిగాల సోదరులు పాటుపడుతున్నారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు…
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఆరేండ్లలో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఆకర్షణీయమైన పారిశ్రామిక అనుకూల విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులకు దిగ్గజ పరిశ్రమలు, ఐటీ సంస్థలు వరుస కడుతున్నాయి. అంతేకాకుండా పాత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించే పనిలోనూ నిమగ్నమయ్యాయి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఐటీ కంపెనీలు తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకుంటుండగా దేశంలో హైదరాబాద్ ఐటీ హబ్‌గా వెలుగులీనుతున్నది. ఈ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీల పెట్టుబడులను జిల్లాలకు మళ్లించే పనిపై దృష్టి సారించింది. నిజామాబాద్ జిల్లాలోనూ ఐటీ సంస్థల కార్యకలాపాలు కొద్ది కాలంలోనే ప్రారంభం కానున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ప్రత్యేక చొరవతో మంజూరైన ఐటీ హబ్ పనులు జోరుగా సాగుతున్నాయి. నూతన కలెక్టరేట్ ప్రాంతంలో ఐటీ హబ్‌కు మూడున్నర ఎకరాల భూమిని కేటాయించారు. సువిశాల ప్రాంతంలో ఈ ఐటీ భవనాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కాగా సుందరీకరణ వేగంగా జరుగుతున్నది.
రూ.50కోట్ల వ్యయంతో…
నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ టవర్‌కు కేటాయించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ నగరాభివృద్ధిని అంచనా వేసుకుని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రూ.50కోట్లు వరకు ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 2018, ఆగస్టు ఒకటో తారీఖున ఐటీ టవర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐటీ టవర్‌ను సువిశాలంగా నిర్మిస్తున్నారు. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్తులతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ను విస్తరించాలనుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం పార్కింగ్, లాన్, ఇతర సౌకర్యాల కల్పనకు ఈ ఖాళీ భూమిని వాడుకోనున్నారు. సుమారు 15 కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతుండగా ఇందులో వందల మందికి ఉపాధి లభించనున్నది.
నిర్మాణ పనులన్నీ పూర్తి…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఐటీ టవర్ పనులు వేగంగా పూర్తి చేశాం. 2020 నుంచి కరోనా వైరస్ ఉధృతితో పనుల్లో కాసింత జాప్యం జరిగింది. పరిస్థితులు కుదుట పడిన అనంతరం పనుల్లో వేగం పెంచాం. తుది మెరుగులు అద్దుతున్నాం. ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అధునాతనంగా బిల్డింగ్‌ను నిర్మించాం. భవిష్యత్తు అవసరాలరీత్యా ఐటీ టవర్ విస్తరణకు సువిశాల ప్రాంతం ఉంది.
– అజ్మీరా స్వామి, జోనల్ మేనేజర్, టీఎస్ఐఐసీ