నిజామాబాద్ క్రైం,జూన్ 15 : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య యత్నించింది. బంధువులతోపాటు పోలీసులను సైతం తప్పుదోవ పట్టించేందుకు విఫల యత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు విషయం బయట పడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు బుధవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన మైలారం సదానంద్(45) కొన్ని సంవత్సరాలుగా కుటుంబ పోషణ నిమిత్తం విదేశాలకు వెళ్లి వస్తున్నాడు. అతని భార్య మైలారం కవిత వరుసకు మరిది అయిన మైలారం శేఖర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది.
విదేశాల నుంచి వచ్చిన భర్త సదానంద్‌కు విషయం తెలియడంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే భర్తను అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయ అనే మరో మహిళతో సదానంద్‌కు ఫోన్ చేయించి నవీపేట్‌కు రప్పించారు. నిర్మానుష్య ప్రదేశంలో వారు మద్యం సేవించారు.అనంతరం కవిత, శేఖర్, జగిరి రాజశేఖర్ గౌడ్, తోకల విజయ నలుగురు కలిసి నదానంద్ మెడకు చున్నీని బిగించి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం కలుగకుండా సదానంద్ నోట్లో గుళికల మందుపోసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై నవీపేట్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
అనంతరం నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సౌత్ రూరల్ సీఐ జగడం నరేశ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. చివరకు పోస్టుమార్టం నివేదిక, సాంకేతికత ఆధారంగా సదానంద్‌ను అతని భార్య మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. బుధవారం నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, మృతుడికి సంబంధించిన బంగారు గొలుసు, బైక్ సీజ్ చేశామని సీపీ నాగరాజు వెల్లడించారు. ఈ హత్య కేసును ఛేదించిన ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నరేశ్, ఎస్సై రాజారెడ్డి, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగాఅభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలిచారు. సమావేశంలో అదనపు డీసీపీ (ఆపరేషన్స్) ఎం.నరేందర్ రెడ్డి, సౌత్ రూరల్ సీఐ నరేశ్, ఎస్సై రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.