విద్యానగర్, జూన్ 12 : కామారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ప్రశాంతంగా జరిగిందని డీఈవో రాజు తెలిపారు. మొదటి పేపర్ 23 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా 5,356 మందికి 5,102 మంది హాజరుకాగా, 254 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 95.26 శాతం హాజరైనట్లుతెలిపారు. రెండో పేపర్ 18 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా 3,933 మందికి 3,742 మంది హాజరుకాగా, 191 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 95.14 శాతం హాజరైనట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కర్షక్ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, పరీక్షల రికార్డులను పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలో..
జిల్లాలో టెట్ ప్రశాంతంగా ముగిసిందని డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 69 పరీక్షా కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన మొదటి పేపర్‌కు 16,454 మంది అభ్యర్థులకు 15,414 మంది హాజరుకాగా 1040 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 53 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం నిర్వహించిన రెండో పేపర్‌కు 12,462 మంది విద్యార్థులకు 11,680 మంది హాజరుకాగా, 782 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని టెట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కేఆర్. నాగరాజు తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోని రవి పబ్లిక్ స్కూల్, ఎస్ఎఫ్ఎస్ పాఠశాలల్లో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. చీఫ్ సూపరింటెండెంట్లను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలను పాటిస్తూ సమయానుసారంగానే ప్రశ్నాపత్రాళ్ల బండిళ్లను తెరిచారా లేదా అని తెలుసుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును సీపీ నాగరాజు పరిశీలించారు.