రెంజల్, జూన్ 12 : మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నదీ తీరాన అయోధ్యకు చెందిన రామభక్తుడు పరమేశ్వర్దాస్ మహరాజ్ లోక కల్యాణార్థం చాతుర్మాస దీక్ష చేపట్టారు. ఆదివారంతో చాతుర్మాస దీక్షను చేపట్టి పదేండ్లు పూర్తయినట్లు త్రివేణి సంగమ తీరాన ఉన్న సీతారాం సంత్ సేవా ఆశ్రమ వ్యవస్థాపకుడు సీతారాం త్యాగి మహరాజ్ తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని పదేండ్ల క్రితం వసంత పంచమి పర్వదినం రోజున మొదటి చాతుర్మాస దీక్షను ప్రారంభించామని, ప్రతి ఏడాది నాలుగు మాసాల పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చుట్టూ మండుతున్న పిడకలు, తలపై నిప్పులకుండను పెట్టుకొని జపం, ధ్యానం చేస్తామని చెప్పారు. పదో సారి చేపట్టిన చాతుర్మాస దీక్షలు ఆదివారంతో ముగిశాయని తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 14న ఏరువాక (సత్యగంగ) పౌర్ణమి రోజున పూర్ణాహుతి, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
14న శనీశ్వర ఆలయ వార్షికోత్సవం
త్రివేణి సంగమ తీరాన సీతారాం సంత్ సేవా ఆశ్రమం పక్కన ఉన్న శనీశ్వర ఆలయ 4వ వార్షికోత్సవాన్ని ఈ నెల 14న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2018లో సుమారు రూ. 15 లక్షలతో దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించామని, వార్షికోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, మహా అన్నదానం, ప్రత్యేక పూజలు చేపడుతామని సీతారాం త్యాగి మహరాజ్ తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా గోదావరినదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.