నిజామాబాద్ రూరల్, జూన్ 12: నిజామాబాద్ జిల్లాలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద జాతీయస్థాయిలో ఐదు గ్రామాలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికై ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి శనివారం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ మండలంలోని పాల్దాలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జాతీయస్థాయి ఉత్తమ జీపీలుగా నిలిచిన ఐదు గ్రామాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితోనే పాల్దా, ఠాణాకుర్దు, వెల్మల్, కందకుర్తి, కుకునూర్ జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామాలుగా ఎంపికయ్యాయి.
ఈ ఐదు గ్రా మాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు గ్రామపెద్దలు, ప్రజల భాగస్వామ్యంతో సమష్టి కృషితోనే పల్లెప్రగతి పనులు చేపట్టిన ఫలితంగా జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామాలుగా నిలిచాయని మంత్రులు కొనియాడారు. అంతేగాకుండా పాల్దా వేదికగా ఐదు గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, వార్డు సభ్యులను మంత్రులు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేసి ప్రోత్సహించారు. ఆదర్శంగా నిలిచిన ఈ ఐదు గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో మంత్రి ఎర్రబెల్లి సీసీ రోడ్లను నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పాల్దా గ్రామానికి రూ.70లక్షలు, మిగతా నాలుగు గ్రామాలకు రూ.30లక్షల చొప్పున నిధులు వెంటనే మం జూరు చేయాలని సభావేదికపైన ఉన్న పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు.