ధర్పల్లి, జూన్ 12 : గంగమ్మ తల్లిని పూజించిన తరువాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు ఆ గ్రామాల ప్రజలు. ఆ తల్లి కృపతోనే వానలు విస్తారంగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి విశ్వాసం. అదే ధర్పల్లి-సీతాయిపేట్ పెద్ద చెరువుకట్టపై వెలిసిన గంగమ్మ ఆలయం. రెండు గ్రామాల మధ్య అందంగా ఉన్న పెద్ద చెరువు కట్టపై ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం ఉంది. ఓ వైపు నిండుకుండలా చెరువు, మరోవైపు పచ్చదనంతో ఆలయ పరిసరాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడి గంగమ్మ భక్తుల కొంగుబంగారం.
ఏరువాక పున్నమి జాతర
ప్రతిఏడాది ఏరువాక పౌర్ణమి రోజున గంగమ్మ జాతరను రెండు గ్రామాల గంగపుత్ర సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి శివపార్వతులు, గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను ధర్పల్లి, సీతాయిపేట్ గ్రామాల్లో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాలు కట్టపై ఉన్న గంగమ్మ ఆలయానికి చేరుకోవడంతో జాతరోత్సవాలు ప్రారంభమవుతాయి.
అతివల కోరికలు తీర్చే అమ్మవారు
గంగమ్మ తల్లిని పూజిస్తే సంతానం లేని మహిళలకు సంతానం అవుతుందని, పెండ్లి కాని వారికి పెండ్లి అవుతుందని మహిళల నమ్మకం. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు, రథం గ్రామాల్లో ఊరేగిస్తున్నప్పుడు దాని చుట్టూ నిష్టతో ప్రదక్షిణలు చేస్తూ నీళ్లు పోస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఎంతో మహిమ ఉన్న ఆలయం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు.జాతరోత్సవాలకు రెండు గ్రామాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు.
ఆకర్షించే మినీ ట్యాంక్‌బండ్ అందాలు
ధర్పల్లి పెద్ద చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి కావడంతో గంగమ్మ ఆలయం ఎంతో ఆకట్టుకుంటున్నది. జాతరకు తరలివచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మినీ ట్యాంక్‌బండ్ అందాలను తిలకిస్తూ ఆనందంగా గడుపుతారు.
భక్తుల కొంగు బంగారం గంగమ్మ
మా తాతల కాలం నుంచి ధర్పల్లి పెద్ద చెరువు కట్టపై ఉన్న గంగమ్మ ఆలయంలో జ్యేష్ఠ్ట పౌర్ణమి రోజు జాతరోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ధర్పల్లి- సీతాయిపేట గ్రామాల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మేమే కూడా జాతరోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. అమ్మవారి కృపతో వానలు సమృద్ధి కురుస్తాయని మా నమ్మకం. ఆలయంలో ప్రతి శివరాత్రికి సైతం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం చేస్తాం. జాతరోత్సవాలను ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.
– కె. అనంతరాజ్, గంగపుత్ర సంఘం, ధర్పల్లి