బాన్సువాడ, జూన్ 12 : విద్యార్థులు, యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియంలో సమ్మర్ క్యాంపును నిర్వహించారు. 30 రోజుల పాటు విద్యార్థులకు ఆర్చరీ, ఖోఖో, షటిల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడలపై శిక్షణ ఇచ్చారు. సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా.. స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి దోహదపడుతాయని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం, ఉద్యోగాలను అందజేస్తున్నదని అన్నారు. ఇటీవల బాక్సింగ్ పోటీల్లో గెలుపొందిన నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లతో పాటు బంజారాహిల్స్‌లో ఇంటి స్థలాన్ని అందజేసినట్లు చెప్పారు. సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు రవీందర్ నాయక్ విలువిద్యను స్పీకర్‌కు వివరించారు. సమ్మర్ క్యాంపులో వివిధ క్రీడల్లో శిక్షణ పొందిన వారికి ప్రశంసాపత్రాలు, మెడల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, కౌన్సిలర్లు, హకీం, రఫీ, అలీమొద్దీన్ బాబా, మినీ స్టేడియం మేనేజర్ నరేశ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.