నిజామాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో జరిగిన నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం తీ వ్రంగా స్పందించింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన తొలిరోజు నుంచి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వ యంత్రాంగం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక ముందడుగు పడింది. ఇప్పటికే సొసైటీకి సంబంధించిన ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తద్వారా డిపాజిటర్లకు భరోసా కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నది. రూ. 3.27కోట్లు దుర్వినియోగం చేసిన కేసులో బాధ్యులైన పీఏసీఎస్(తాళ్లరాంపూర్) మాజీ చైర్మన్ గంగారెడ్డి, కార్యదర్శి స్వామికి సంబంధించిన వ్యక్తిగత ఆస్తులను వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా సహకార అధికారి సింహాచలం ఇప్పటికే సర్‌చార్జీని సైతం జారీ చేశారు. బాధ్యులైన వారికి నోటీసులు సైతం పంపించారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పోషిస్తున్న పారదర్శకమైన చర్యలతో ఆయా సొసైటీల్లో అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలకు గురికాక తప్పదనే సంకేతాలను స్పష్టం చేస్తున్నది.
సేల్ ఆఫీసర్ నియామకం…
తాళ్లరాంపూర్ విండోలో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి మాజీ చైర్మన్ గంగారెడ్డి, కార్యదర్శి స్వామికి సంబంధించిన వ్యక్తిగత స్థిరాస్తులను ఇప్పటికే సహకార శాఖ గుర్తించింది. సొసైటీ ప్రస్తుత పాలకవర్గం సర్వసభ్య సమావేశమై ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లలో నమ్మకం కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌ను జిల్లా సహకార అధికారి(డీసీవో)సింహాచలం ముందు కు తీసుకువచ్చారు. సొసైటీ పాలకవ ర్గం తీసుకు వచ్చిన పిటిషన్‌ను డీసీవో పరిశీలించారు. సహకార చట్టం ప్రకారం అక్రమాల వ్యవహారంపై తీసుకోవాల్సిన చర్యలను గుర్తించి తదనుగుణంగా ముందుకు సాగుతున్నారు. ఆస్తుల వేలానికి ఫార్మ్-2, ఫార్మ్-6 జారీ చేశారు. గం గారెడ్డి, స్వామికి సంబంధించిన ఆస్తులను వేలం వేయడానికి మోర్తాడ్ క్లస్టర్ అధికారి ఎం.శ్రీనివాస్‌ను సేల్ ఆఫీసర్‌గా డీసీవో నియమించారు. నిధులను మూకుమ్మడిగా కలిసి కొల్లగొట్టిన మాజీ చైర్మన్, కార్యదర్శికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం గుర్తించింది. వాటి పై క్రయ, విక్రయాలను నిలుపుదల సైతం చేసింది. ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేయడం ద్వారా దుర్వినియోగమైన నిధులన్నీ రికవరీకి అవకాశం కలిగినట్లయ్యింది.
ఆస్తులు ఎక్కడెక్కడంటే…?
సహకార సంఘంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులపై ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులను ప్రభుత్వం నమోదు చేసింది. మాజీ చైర్మన్ గంగారెడ్డి, సెక్రటరీ స్వామికి సంబంధించిన ఆస్తుల చిట్టాను సహకార శాఖ సేకరించింది. గంగిరెడ్డికి గుమ్మిర్యాల్ గ్రామంలో 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉం ది. ఇక్కడే ఖాళీ జాగాలను సైతం గుర్తించారు. వీటి విక్రయానికి సేల్ ఆఫీసర్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సెక్రటరీ స్వామికి ఆర్మూర్‌లో ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు, రాంపూర్ గ్రామంలో ఇంటి స్థలం ఉంది. ఈ ఆస్తులను ఒకేసారి ప్రభుత్వమే వేలం వేసి అర్హులైన వారికి కేటాయిస్తారు. తాళ్లరాంపూర్ సొసైటీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. ఆదర్శవంతమైన రైతులతో విజయవంతంగా సాగుతున్న ఇక్కడ గత పాలకవర్గం అనుసరించిన తప్పుడు విధానాలతో అవినీతి మచ్చ అంటుకుంది. తిరిగి పూర్వ వైభవం తీసుకు వచ్చి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు.

సొసైటీ ఆస్తులకు వేలం…
తాళ్లరాంపూర్ పీఏసీఎస్‌లో అక్రమాలపై సెక్షన్ 51ప్రకారం విచారణ జరిగింది. జిల్లా సహకారి అధికారి సింహాచలం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సత్యనారాయణ రావు కలిసి 2012-13 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలపై విచారణ జరిపారు. 2021, మార్చి 19న ప్రారంభమైన విచారణ 3 నెలల 20 రోజులు పాటు కొనసాగింది. రూ.6.5కోట్ల రైతుల డిపాజిట్లు, రూ.5కోట్లు బ్యాంక్ రుణాలు, రూ.1.5 కోట్ల వినియోగాన్ని పరిశీలించారు. నిధులను ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తేలింది. కార్యాలయ భవన నిర్మాణం, పరిపాలన భవనంలో విలాసవంతమైన సౌకర్యాలు, రైస్‌మిల్, ఫంక్షన్ హాల్, 20 వరకు గోదాములు నిర్మించారు. వాటిల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చారు. రిజర్వ్ బ్యాంకు, నాబార్డు సూచనలు పాటించకుండా సభ్యులు, సభ్యులేతర నుం చి డిపాజిట్లు స్వీకరించి అధిక వడ్డీ రేట్లను చెల్లించారు. డిపాజిట్ల సొమ్మును సంఘ కార్యాలయ భవనం, రైస్‌మిల్లు, కల్యాణమండపం, గోదాముల నిర్మాణానికి మళ్లించినందున డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. రైతుల డిపాజిట్లను త్వరితగతిన చెల్లించేందుకు తాళ్లరాంపూర్ పీఏసీఎస్‌కు చెందిన 9 స్థిరాస్తులను ఈ-వేలంలో విక్రయించాలని సొసైటీ మహాజన సభ తీర్మానం ప్రకారం అనుమతులు ఇప్పటికే మంజూరు అయ్యాయి. రైస్‌మిల్, కల్యాణ మం డపం, గోదాములను ఈ-వేలంలో విక్రయించి దాదాపు రూ.7.50కోట్లు సేకరించాలని సహకార శాఖ నిర్ణయించింది.
డిపాజిట్ల ప్రయోజనాలు కాపాడతాం…
తాళ్లరాంపూర్ సొసైటీ అక్రమాల వ్యవహారంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాము. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టే ప్రసక్తే లేదు. డిపాజిటర్లకు చెల్లింపులు జరిపేందుకు సొసైటీ ఆస్తులను రికవరీ చేస్తున్నాము. అలాగే నిధులు దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకవర్గం మాజీ చైర్మన్ గంగిరెడ్డి, సెక్రటరీ స్వామిలపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. వీరి ఆస్తులను వేలం వేసి రూ.3.27కోట్లు సమీకరించేందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి.
– సింహాచలం, నిజామాబాద్ జిల్లా సహకార అధికారి