బీర్కూర్/ బాన్సువాడ రూరల్/ బాన్సువాడ టౌన్/ నస్రుల్లాబాద్, జూన్ 11: రాష్ట్రంలోని వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని… కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా తన కంఠంలో ప్రాణమున్నంత వరకు పెట్టనివ్వనని సీఎం కేసీఆర్ చెప్పారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామని, రైతాంగ వ్యతిరేక విధానాలను సీఎం సహించబోరని స్పష్టంచేశారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లో శనివారం పర్యటించారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. పల్లెప్రగతి పనులతో గ్రామాలు మెరిసిపోతున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో నెలకు ఐదారువందల కన్నా ఎక్కువ పింఛన్లు ఇవ్వడం లేదని, తెలంగాణలో మాత్రం రూ.2వేల పింఛన్ ఇవ్వడం గర్వంగా ఉన్నదన్నారు. చత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలుచేయాలని హితవుపలికారు.
రాష్ట్రంలోని వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామంటే ఊరుకోబోమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బాన్సువాడ మండలంలో శనివారం పర్యటించారు.
దేశాయిపేట్ గ్రామంలో రూ.5లక్షలతో నిర్మించిన ఎల్లమ్మ ఆలయ ప్రహరీ, సుమారు రూ.17లక్షల 27వేలతో వేసిన సీసీ రోడ్డు, రూ.16లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, రూ.5లక్షలతో నిర్మించిన గంగపుత్ర సంఘ ప్రహరీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రం తెచ్చుకున్నదే రైతుల ఆత్మగౌరవం కాపాడుకోవడానికని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతామంటే ఊరుకోబోమని, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అది జరగనివ్వనని దృఢసంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. పల్లె ప్రగతి పనులతో గ్రామాలు మెరిసిపోతున్నాయని తెలిపారు.
గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్ల నిర్మించామన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్రంలోనే ఎక్కువగా నిర్మించిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అని, ఏకైక నాయకుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అని వివరించారు. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తారని, వారికి పనీపాటా ఉండదని అన్నారు. వారు పనిచేయరు.. చేసేవారిని చేయనివ్వరని విమర్శించారు. కరోనా పరిస్థితులతో మూడేండ్లుగా కొత్త ఫించన్లు రాకపోవడం దురదృష్టకరమని, వచ్చే నెల నుంచి నూతన పింఛన్లను అందజేస్తామన్నారు.
పక్క రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నెలకు ఐదారు వందల కన్నా ఎక్కువ పింఛన్లు ఇవ్వడం లేదని, మన రాష్ట్రంలో మాత్రం రూ.2వేలు అందించడం గర్వంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో భూమిశిస్తు వసూలు చేసే వారని, కేసీఆర్ వాటిని రద్దు చేశారన్నారు. రైతులకు పెట్టుబడిసాయం అందజేస్తున్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న ఛత్తీస్గడ్, కర్ణాటక రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలు చేసి మాట్లాడాలని హెచ్చరించారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ పాత బాలక్రిష్ణ, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్‌రాంరెడ్డి, జడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, సర్పంచ్ శ్రావణ్‌కుమార్, ఎంపీటీసీ రమణ, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ల ప్రారంభం
నస్రుల్లాబాద్, జూన్ 11: మండలంలోని అంకోల్ క్యాంపు గ్రామంలో స్త్రీనిధి ఆర్థిక సహకారంతో టీఎస్రెడ్కో ద్వారా ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లపై అవగాహన కల్పించి ఏర్పాటు చేసుకునేలా కృషి చేసిన సర్పంచ్ వెంకటరమణను స్పీకర్,మంత్రులు అభినందించారు.
అనంతరం మహిళలకు డ్వాక్రా రుణాలకు సంబంధించిన రూ.5కోట్ల 43లక్షల చెక్కును అందజేశారు. సబ్సిడీపై వచ్చిన ఫ్యాన్లను పంపిణీ చేశారు. గ్రామానికి రూ.8లక్షల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీటీసీ సభ్యురాలు జన్నూబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మాజీద్ పాల్గొన్నారు.
కట్టపై కూర్చొని ఏడ్చినా చంద్రబాబు నీళ్లివ్వలేదు..
సమైక్య పాలనలో నిజాంసాగర్ కట్టపై కూర్చొని ఏడ్చినా అప్పటి సీఎం చంద్రబాబు నీళ్లివ్వలేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. సాగర్ ఎండిపోతే వారం రోజులు బాబు వద్ద కూర్చొని అడిగినా నీళ్లు వదిలేవారని కాదని, హైదరాబాద్‌కు తాగేందుకు కావాలని గద్దించేవాడని అన్నారు. అడగకముందే సింగూరు నుంచి నిజాంసాగర్‌కు నీటిని వదిలి పంటలను కాపాడిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో 28లక్షల మందికి రూ.8వందల కోట్లు మాత్రమే పింఛన్లకు కేటాయించేవారని, ఇప్పుడు 40 లక్షల మందికి రూ.12వేల కోట్లు అందజేస్తున్నామని చెప్పారు.
వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకు బాన్సువాడ నియోజకవర్గంలో 10వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని, 5వేల ఇండ్ల పనులు జరుగుతున్నాయని, మరో 3వేల ఇండ్లు రాబోతున్నాయన్నారు. పక్క రాష్ర్టాల్లో ఆరు గంటల కరెంటే దిక్కులేదని, తెలంగాణలో మాత్రం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోయిన వానకాలం కొనుగోలు చేసిన వడ్ల డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఛత్తీస్‌గడ్‌లో ఎకరానికి 10 క్వింటాళ్ల కన్నా ఎక్కువ కొనుగోలు చేయరన్నారు. అక్కడి వారు బాన్సువాడకు తెచ్చి రూ.1100కు క్వింటాలు చొప్పున అమ్ముకున్న పరిస్థితి ఉందన్నారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమంటే తామే కొంటామని ధైర్యంగా ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.
కేంద్రానికి కడుపుమంట..
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి కడుపు మండుతున్నదని రాష్ట్ర రోడ్లు, భవనా లు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శా ఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఏ డేండ్ల పాలనలో పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని, సీఎం కేసీఆర్‌తోనే ఇది సాధ్యమైందన్నా రు. 24 గంటల ఉచిత కరెంటు, ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం నుంచి తెచ్చిన సాగునీరే సాక్ష్యమన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులను పంపించేవారని, అందులో భాగంగానే తెలంగాణకు కూడా 2019 నుంచి నెలకు జనాభా ప్రాతిపదికన పంపిస్తున్నదని అన్నారు. దేశంలోని 10 ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తెలంగాణకు చెందినవే ఎంపికయ్యాయని, దీంతో కేంద్ర ప్రభుత్వానికి కడుపు మండుతున్నదన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరిగితే దేశంలో జరిగినట్లు కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పక్షాన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిలబడి కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని సూచించారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర..
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం అందరిపై ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ఆధారంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుండగా, కేంద్రం మన రాష్ర్టానికి సహకరించడం లేదని విమర్శించారు. గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలను నిర్మించుకోవడంలాంటివి చూస్తే కేంద్రంలోని పెద్దలకు కండ్లు మండుతున్నాయన్నారు. పల్లె ప్రగతిలో స్థానిక జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ప్రాధాన్యమివ్వడం హర్షణీయమన్నారు. ఇంటి మాదిరిగానే గ్రామం కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నెలనెలా ఠంఛన్‌గా నిధులను అందజేసి అభివృద్ధి చేస్తున్న మహా నాయకుడు, సీఎం కేసీఆర్ అని అన్నారు. దేశంలోనే ఇలాంటి పనులను చేస్తున్నది.. తెలంగాణ ప్రభుత్వమేనని వివరించారు. చాలా మంది పెద్దపెద్ద మాటలు చెబుతారని, కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా అభివృద్ధి పనులు మాత్రం బాగానే జరుగుతున్నాయని, అవి ఎక్కడ చూసినా, ఎవరు చూసినా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ పట్టుదలతోనే జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు రూ.4లక్షలు సరిపోవడం లేదని, మరికొంత నిధులు కేటాయించాలని అన్నారు. గ్రామాల్లో మహిళాభవనాలను నిర్మించుకునేందుకు నిధులు కేటాయించాలని కోరారు. సభాపతి అనుభవాలను పాఠాలుగా భావించి, వాటిని నేర్చుకొని తాము కూడా రాజకీయాల్లో నిలుస్తామని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలాంటి నాయకుడు తమ వెంట ఉంటే అభివృద్ధికి లోటుండదని అన్నారు. జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు.