నిజామాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పల్లె ప్రగతి ఐదో విడుత కార్యక్రమం అమలు తీరుపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం వాడివేడిగా జరిగింది. నిజామాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమీక్షలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, హరితహారం, ట్రాక్టర్లు, ట్యాంకర్ వినియోగంపై లోతుగా చర్చించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మొత్తం 526 వైకుంఠధామాల నిర్మాణం జరిగితే ఇవన్నీ వినియోగంలో ఉన్నాయని అధికారులు సమాచారం ఇచ్చారు. మండలాల వారీగా ఎన్ని వినియోగంలో ఉన్నాయని మంత్రి వివరాలు ఆరా తీయడంతో డొల్లతనం బయటపడింది. ఆయా మండలంలో సగం వైకుంఠధామాలు ఇతరత్రా కారణాలతో వినియోగంలోకి రాకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ఇట్లాగైతే ఎట్లా? అంటూ మందలించారు. పలు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పేందుకు ఎంపీడీవోలు వెనకడుగు వేశారు. జరిగిన పని తీరును లెక్కలతో చెప్పేందుకు వెనుకంజ వేయడంతో మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అభినందనలు.. అసంతృప్తి…
కొద్ది రోజుల క్రితం దేశ వ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 20 తెలంగాణకు చెందినవే కావడం అందులో ఐదు జీపీలు నిజామాబాద్ జిల్లావే ఉండడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. జిల్లా యంత్రాంగం కష్టపడడంతోనే ఈ గుర్తింపు వచ్చిందని మెచ్చుకున్నారు. మరింతగా కష్టపడి తెలంగాణకు అవార్డులు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య లేదన్నారు. కేంద్ర ప్రభుత్వమే కిరికిరి పెడుతూ నిధులు విడుదల చేయకుండా కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర బృందాలను రాష్ర్టానికి పంపి తనిఖీల పేరుతో నాటకాలు ఆడుతోందన్నారు.
తప్పులు దొరకబట్టి ఇరికించాలని భావిస్తున్నప్పటికీ వారికి అలాంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వైకుంఠధామాల్లో వినియోగంలోకి రానివే ఎక్కువగా ఉండడంపై మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. 526 జీపీలకు కామారెడ్డి జిల్లాలో అన్ని వినియోగంలో ఉన్నట్లుగా రిపోర్ట్ ఇవ్వడం ఏంటంటూ నిలదీశారు. ర్యాండమ్‌గా ఎల్లారెడ్డి, జుక్కల్ ఎంపీడీవోలను వివరాలు అడగడంతో తడబాటుకు గురయ్యారు. దీంతో మంత్రులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గాలి మాటలు చెప్పొద్దంటూ సూచించారు. వైకుంఠధామాల్లో కరెంట్, నీటి సరఫరాకు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని మిషన్ భగీరథ ఎస్ఈని మంత్రులు ప్రశ్నించారు.
మళ్లీ వస్తా…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీపీవోల పనితీరుపై అహసనం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు త్వరలోనే మరోసారి జిల్లాకు వస్తానని చెప్పారు. రెండు నెలలకోసారి సమీక్షలు నిర్వహిస్తానని అన్నారు. వచ్చే సమావేశం నాటికి మార్పు కనిపించకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రామ పంచాయతీలకు బిల్లులు నిలిపివేస్తలేమని, ఇప్పటి వరకు నిధులు క్లియర్ చేశామన్నారు. కొద్ది రోజుల్లోనే మరో రూ.300 కోట్లు కూడా మంజూరు చేయబోతున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు మరింత బాధ్యతగా పని చేస్తే మంచిదంటూ మంత్రులు చెప్పారు. సీఎం కేసీఆర్ అహోరాత్రులు కష్టపడి తీసుకు వచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దూరదృష్టితో పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు దాదాన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ, కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేశ్ వీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్‌తో పాటు అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వేప, రావి, చింత మొక్కలు నాటండి…
గ్రామాల్లో ఎక్కువగా రోడ్డుకు ఇరువైపులా వేప, రావి, చింత మొక్కలను నాటాలని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నీళ్లు ఉన్నా, లేకపోయినా ఇరక తాళ్ల చెట్లను పెంచాలన్నారు. ఇవీ చూడ్డానికి అందంగా కనిపిస్తాయని చెప్పారు. మరోవైపు మొక్కలకు ట్రీ గార్డులకు బదులుగా సర్కార్ తుమ్మను రక్షణగా పెడితే పశువులు దరి చేరవని ఎర్రబెల్లి సలహా ఇచ్చారు. బెంగళూర్‌లో ఎక్కడా ట్రీగార్డులు ఉండవని గుర్తు చేశారు. ఈ సూచనను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. మొక్కలు నాటడంలో పెద్ద వాటికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చిన్న వాటిని నాటడం ద్వారా రక్షించడం కష్టమవుతుందన్నారు. డంపింగ్ యార్డు ద్వారా ఆదాయం జనరేట్ కాకపోవడంపై మంత్రి ఎర్రబెల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు నుంచి ప్లాస్టిక్, ఇతర వస్తువులు ఎత్తుకుపోతున్నారని ఎంపీడీవోలు చెప్పడంపై సంతృప్తి చెందలేదు. వాటిని ఎప్పటికప్పుడు అమ్మితే ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రంలో అవసరాలకు తగిన ప్లాస్టిక్ లేదని బయట కిలోకు రూ.60 చొప్పున కొంటున్నారని చెప్పారు. పల్లె ప్రకృతి వనాల్లో ప్రహరీలు, ఇనుప ఫెన్సింగ్‌కు బదులుగా కాగితపు పూల మొక్కలను పెంచితే చూడ్డానికి అందంగా రక్షణ గోడగా కనిపిస్తుందన్నారు.
ఊరూరా గ్రామ సమాచారం…
ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాల వివరాలతో సమాచార పట్టికను తయారు చేయాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ అమలవుతున్నా నిజామాబాద్, కామారెడ్డిలో ఎక్కడా కనిపించలేదన్నారు. ఒక చోట జీపీ లోపల చిన్నగా పెట్టారని చెప్పారు. దాని వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలియజేసే విధంగా జీపీ బిల్డింగ్ వద్ద, ముఖ్యమైన కూడలి వద్దనో ఏర్పాటు చేయాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, పించన్లు, కేసీఆర్ కిట్ ఇలా పథకాల సమాచారంతో బోర్డులు రూపొందించాలని ఆదేశించారు. ఈ అంశం తక్షణం అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెండు జిల్లాలకు చెందిన కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.