నిజామాబాద్ రూరల్, జూన్ 11: తెలంగాణ ఏర్పడి, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఊహించనిరీతిలో అభివృద్ధి చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధి బాట పట్టడమేకాకుండా ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే పరిస్థితి ఏర్పడిందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్‌తో శనివారం పాల్దా గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో జరగని అభివృద్ధి తెలంగాణలో వేగవంతంగా జరుగుతుండడాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీల నేతలు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుట్టున్నారని మండిపడ్డారు.
పేద బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. బీజేపీ పాలిత కర్ణాటకలో పింఛన్ రూ.500లు, గుజరాత్లో రూ.600లు ఇస్తున్నారని, మన రాష్ట్రంలో నెలకు రూ.2 వేల పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి ఊరిలో బుడ్డర్ఖాన్లాంటి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉంటారని, వారికి చాలెంజ్ చేసి చెప్పాలని ప్రజలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని విపక్ష పార్టీలకు వివరించి ఎదిరించాలన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణల పేరిట వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టుమని కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నదని చెప్పారు. మీటర్లు పెట్టిస్తే రాష్ర్టానికి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఇస్తామని కేంద్ర మంత్రులు చెప్పినా కూడా తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మోటర్లకు మీటర్లు పెట్టబోమని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారని మంత్రి వివరించారు.
రైతాంగ శ్రేయస్సు కోసం అహర్నిషలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు వ్యతిరేక విధానాలను ఒప్పుకోరన్నారు. ఒక మోటారుకు మీటర్ బిగిస్తే రూ. 80వేల కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుందని, దీంతో రైతుల నడ్డివిరిచే పరిస్థితి నెలకొంటుందని ప్రజలకు వివరించారు. గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని నిజామాబాద్ ఎంపీ ఇచ్చిన హామీ ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తన జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తెప్పించుకోలేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేతగాని నాయకుడని విమర్శించారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీని ఈసారి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైన మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును తాము అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు బీజేపీ, కాంగ్రెస్ పాలకులకు పట్టవని ధ్వజమెత్తారు.
పల్లెప్రగతితోనే జాతీయస్థాయి గుర్తింపు..
– మంత్రి ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్రంలోని గ్రామాలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం వెనుక సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమమేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో టాప్ 10లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నాలుగు ఉత్తమ జీపీలు ఎంపికయ్యాయని, టాప్ 20లో మన రాష్ర్టానికి చెందిన 19 గ్రామాలు ఎంపిక కాగా అందులో 5 గ్రామాలు మన జిల్లాలకు చెందినవే ఉండడం గర్వించదగిన విషయమన్నారు. కలెక్టర్‌తో పాటు అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, ప్రజల భాగస్వామ్యంతో కృషి చేసిన ఫలితంగా జాతీయస్థాయిలో ఉత్తమ జీపీలుగా ఎంపికయ్యాయని వివరించారు. నిజామాబాద్ జిల్లాకు రూ.405కోట్లతో పల్లెప్రగతి ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాష్ట్రంలో బీడు భూములను సాగులోకి తేవాలనే కృతనిశ్చయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులతోపాటు వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా పునరుజ్జీవ పథకం కింద శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తిరిగి తెప్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయి
– ఎమ్మెల్సీ వీజీగౌడ్
సమైక్య పాలనలో అభివృద్ధి గురించి ఏ నాయకుడూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ వచ్చాక గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతున్నాయని ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు పుష్కలంగా నిధులు మంజూరవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు మంజూరు చేస్తున్న ఫలితంగా గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని వివరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు రూ. 8 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ప్రతినెలా రూ.250కోట్ల మంజూరు..
అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమం కింద ప్రతినెలా రూ.250కోట్లు మంజూరు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అభివృద్ధి తీరును ప్రజలందరూ గుర్తించాలని, ప్రతి జీపీకి కార్యదర్శి అవసరం దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా 9,300 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించినట్లు స్పష్టం చేశారు.