బీబీపేట్/మాచారెడ్డి/దోమకొండ/భిక్కనూర్/ఎల్లారెడ్డి రూరల్/గాంధారి, జూన్11: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాయికుమార్ అన్నారు. శనివారం బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతున్నదని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులను అప్డేట్ చేయాలని, బహుమతి వచ్చిందని ప్రాసెసింగ్ ఫీజు కోసం డబ్బులు పంపాలని అడుగుతారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత తదితర అంశాలపై ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ తేలు లక్ష్మీ సత్యనారాయణ, ఏఎస్సై రాములు, అనిల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు సూతరి రమేశ్, నందు, రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంతో పాటు గజ్యా నాయక్‌తండా ఎక్స్‌రోడ్డు, పాల్వంచలో సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఏఎస్సై రామేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బ్యాంకు అధికారుల పేరిట ఫోన్ చేసే వ్యక్తులకు ఓటీపీ, ఆధార్ నంబర్, డెబిట్, క్రెడిట్ కార్డుల నంబర్లు చెప్పకూడదని సూచించారు. దోమకొండ మండలం కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు సైబర్ సురక్షత- జాతీయ భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. అనుకోని పరిస్థితుల్లో మోసపోయినట్లు గ్రహిస్తే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జడ్పీటీసీ సభ్యులు తిర్మల్‌గౌడ్, అంజలి, నాయకులు శ్రీనివాస్, రాజేశ్, మల్లేశ్ యాదవ్, సజ్జన్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూర్ మండలంలోని బీటీఎస్ చౌరస్తాలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. తమనుతాము రక్షించుకోవడంతోపాటు కుటుంబ సభ్యులు, తోటివారు సైబర్ నేరాలకు గురి కాకుండా చూడాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సీఐ తిరుపయ్య, ఎస్సై ఆనంద్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని దుకాణాదారులకు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అవగాహన కల్పిస్తూ స్టిక్కర్లు అతికించారు. ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ప్రేమ్‌సింగ్, అశోక్ తదితరులున్నారు. గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద సైబర్ నేరాలపై గ్రామస్తులకు ఎస్సై సాయిరెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.