నిజామాబాద్ రూరల్, జూన్ 9 : నిజామాబాద్ జిల్లాలోని పాల్దా గ్రామం జాతీయస్థాయిలో ఉత్తమ జీపీగా 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. గ్రామాల్లో అభివృద్ధి పనులు, పచ్చదనం పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి ఉత్తమ జీపీలను ఇటీవల ప్రభుత్వం ఎంపిక చేసింది. ఉత్తమ జీపీగా ఎంపికైన పాల్దా గ్రామాన్ని ఈనెల 11వ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించేందుకు రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ముందస్తుగా చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులు, ఏర్పాట్లపై సమాయత్తమయ్యారు.
జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, ఆర్డీవో రవి, తహసీల్దార్ ప్రశాంత్‌కుమార్, ఎంపీడీవో మల్లేశ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్దా గ్రామానికి చేరుకొని గతంలో చేపట్టిన పల్లెప్రగతి పనులను గురువారం పరిశీలించారు. అనంతరం నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా పాల్దా గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు, అవెన్యూ ప్లాంటేషన్ తదితర వాటిని కలెక్టర్ పరిశీలించి ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని మహాలక్ష్మీ ఆలయ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో మంత్రి సభకు ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గ్రామంలోని అన్ని కాలనీలు పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కల చుట్టూ పిచ్చిమొక్కలను తొలగించేలా చూడాలని జడ్పీసీఈవో, డీపీవోను సూచించారు. మంత్రి పర్యటించే కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఎల్పీవో నాగరాజు, ఎంపీవో మధురిమ, సర్పంచ్ సుప్రియా నవీన్, ఎంపీపీ ఆమనీ నరేశ్, సొసైటీ చైర్మన్ జితేందర్, గ్రామపెద్దలు ప్రభాకర్, దేవన్న, రాకేశ్, పవన్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, ఏపీవో పద్మ తదితరులు ఉన్నారు.