నందిపేట్, జూన్ 7: శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-అనిల్‌కుమార్ దంపతులతోపాటు దేవనపల్లి కుటుంబీకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాల్గవ రోజు జనసందోహంతోపాటు వేదమంత్రాల ప్రతిధ్వనుల మధ్య వేడుకగా నిర్వహించారు. మూర్తుల ప్రాణప్రతిష్ఠలో భాగంగా మంగళవారం ఫల, పుష్ప, శయ్య, ధాన్య, ధనాధివాసాలు భక్తుల హృదయాలను మురిపించాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్ర నియమాల అనుసారం సాగిన ఈ వేడుక ఆధ్యాత్మిక శోభను ద్విగుణీకృతం చేసింది. పవిత్ర ప్రతిష్ఠాపన విగ్రహాలతోపాటు పరివారం విగ్రహాలకు ఘనంగా అధివాసం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహిమాన్విత శ్రీలక్ష్మీ నృసింహస్వామి మూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా నృసింహ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ప్రాణప్రతిష్ఠతో భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా మూర్తులు శక్తివంతమవుతాయని క్రతువు సంయోజకులు, నర్సింహ స్వామి ఉపాసకులు వేదాల భార్గవ నర్సింహ స్వామి వివరించారు. చౌడమ్మ కొండూర్‌లో స్వామివారి దివ్య ఆలయ నిర్మా ణం సాక్షాత్తు నృసింహ స్వామి ఆకాంక్ష అని, ప్రజల నాయకురాలిగా లోక కల్యాణం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరివారం ఈ మహాక్రతువును శాస్ర్తోక్తంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రముఖుల రాకతో సందడి..
నాల్గవ రోజు ప్రముఖుల రాకతో నృసింహస్వామి ఆలయంలో సందడి నెలకొంది. టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ లు శేరి సుభాష్‌రెడ్డి, వీజీగౌడ్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి – రజితారెడ్డి దంపతులు, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు లోయపల్లి నర్సింగ్‌రావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డీఆర్డీవో చందర్‌నాయక్, టీయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, గడీల శ్రీరాములు, నందిపేట ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, నిజామాబాద్ కార్పొరేటర్లు, ఆర్మూర్ కౌన్సిలర్లు, నందిపేట్ మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి ఆలయ ప్రాంగణఁలో వివిధ సాంస్కృతిక కార్యమ్రాలు నిర్వహించారు.

ప్రత్యేక పూజలు..
నాల్గవ రోజు ప్రాతఃఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సేవాకాలం నివేదన, మంగళ శాసనాలు, వేదవిన్నపాలు, ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్రమూర్తి, మంత్రహవనం, పంచసూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్యపూర్ణాహుతి, శాత్తుమోరై కార్యక్రమాలు భక్తజనరంజకంగా జరిగాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో ప్రారంభమైన సాయంకాల కార్యక్రమాలు ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. పూజల్లో దేవనపల్లి నవలత- రాంకిషన్‌రావు, ననిత-అరుణ్‌కుమార్ దంపతులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న భజన..
ఇస్కాన్ భక్తులతోపాటు ఆయా గ్రామాల నుంచి వచ్చిన భక్తులు చేసిన భజన ఎంతో ఆకట్టుకున్నది. నృసింహస్వామిని కొలుస్తూ పాడిన భక్తి పాటలు భక్తిపారవశ్యంతో ముంచెత్తాయి. ఉద యం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా దైవ నామ స్మరణతో భజన పాటలు పాడుతూ వేడుకున్నారు. ఆ యా ప్రాంతాల నుంచి వచ్చిన ఇస్కాన్ భక్తులు హరే రామ.. హరే కృష్ణ..అని స్మరిస్తూ అక్కడున్న భక్తులతో స్మరణ చేయించారు.