కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో విజయవంతంగా అమలవుతున్న పథకాలు దేశంలోని మిగతా రాష్ర్టాల్లో ఎక్కడా లేవన్నారు. చందూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సిద్ద్దాపూర్, జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలు పూర్తయితే బాన్సువాడ నియోజకవర్గంలో నీరు అందని ఒక్క గుంట కూడా ఉండదన్నారు. రైతులు వరి కాకుండా ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, దీని ద్వారా వరి కన్నా అధిక ఆదాయం పొందవచ్చని అన్నారు.
చందూర్, జూన్ 6 : దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చందూర్ మండల కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు, నాయకులు గ్రామంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి స్పీకర్‌కు ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్డు, క్రీడా మైదానం, పెద్దమ్మతల్లి ఆలయం, ఫంక్షన్ హాల్, రైతు వేదిక, మండల కాంప్లెక్స్, కుమ్మర సంఘం, బోయి సంఘం, రజక సంఘం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, సొసైటీ భవనాలు, 20 డబుల్ బెడ్ రూం ఇండ్లను స్పీకర్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలో ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. చందూర్ మండలం కావాలని ఉద్యమించడంతో మాటిచ్చి మండలంగా మార్చినట్లు గుర్తు చేశారు.
2014 ముందు పింఛన్లు మొత్తం కలిపి తెలంగాణలో రూ.800 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.12 వేల కోట్లు ఇస్తున్నామని చెప్పారు. రైతులు వరి కాకుండా ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్‌పామ్ పంట సాగు చేస్తే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని దీని ద్వారా వరి పంట కన్నా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. చందూర్ గ్రామస్తుల కోరిక మేరకు త్వరలో బస్టాండ్ నుంచి లోపలికి వెళ్లే రోడ్డును డబుల్ రోడ్డు మారుస్తామని, పీహెచ్సీ, డ్వాక్రా భవనం, కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మాటిచ్చిన పనులన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుందామని సభాపతి అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, డీపీవో జయసుధ, ఏఎంసీ చైర్పర్సన్ కవిత, అధికారులు, ప్రజాపతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వచ్చే జూన్‌లోపు సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తిచేస్తాం : సభాపతి పోచారం
వర్ని, జూన్ 6: మండలంలోని సిద్దాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న మూడు చెరువులను కలుపుతూ నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను వచ్చే ఏడాది జూన్‌లోపు పూర్తిచేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైతుల అవసరాలను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులను నిర్మిస్తుందన్నారు. వర్ని మండలం సిద్దాపూర్ గ్రామం వద్ద రూ. 120 కోట్లతో చేపట్టిన సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను సోమవారం స్పీకర్ పరిశీలించారు. పనుల వివరాలను కాంట్రాక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగు నీటి అవసరాల నిమిత్తం కాళేశ్వరం, భక్త రామదాసు, పాలమూరు ఎత్తి పోతలు, సీతారామ తదితర ప్రాజెక్టులను స్వల్ప కాలంలో పూర్తి చేశారని తెలిపారు. సిద్దాపూర్ రిజర్వాయర్‌లో 11-12 టీఎంసీల నీరు నిల్వ ఉంచి సుమారు 12వేల ఎకరాలకు సాగు నీరందించనున్నట్లు చెప్పారు.
వచ్చే వర్షాకాలం నాటికి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి నిజాంసాగర్ ఎగువ ప్రాంత రైతులకు సాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవరకు తాను ఇక్కడే బస చేస్తానని, ఇందుకు ప్రత్యేక క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాకోరా, చందూరు, చింతకుంట ఎత్తి పోతల పథకాలను కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. స్పీకర్ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, మండల కో -ఆప్షన్ సభ్యుడు కరీం, టీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, బర్దావల్ దశరథ్, కిషన్, బాల్ సింగ్, ఇరిగేషన్ డీఈ శ్రావణ్ కుమార్, ఈఈ రమ, ఏఈలు శ్రీనివాస్, జీవన్, వర్క్ ఇన్స్పెక్టర్ రషీద్ తదితరులు ఉన్నారు.