మాక్లూర్/కమ్మర్పల్లి/మోర్తాడ్/వేల్పూర్/ ఆర్మూర్/ డిచ్పల్లి/ధర్పల్లి/ఇందల్వాయి/జక్రాన్‌పల్లి/రుద్రూర్, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని దుర్గానగర్‌లో రోడ్లకు ఇరువైపులా ఉపాధిహామీ కూలీలు నాటుతున్న మొక్కలను సోమవారం పరిశీలించి కూలీలతో మాట్లాడారు. గ్రామాల్లో మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణారావు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మొక్కలు నాటారు. సమీక్ష నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సర్పంచ్ బోగ ధరణి, ఉపసర్పంచ్ గంగారెడ్డి, జీపీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో వైకుంఠ ధామాల వద్ద చెత్త తొలగించారు. మొక్కలను నాటారు. కంపోస్టుషెడ్లో తయారైన ఎరువును హరితహారం మొక్కల కోసం సిద్ధం చేశారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించారు. ఈపనులను ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.
వేల్పూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు శ్రమదానం నిర్వహించారు. గ్రామంలోని హైస్కూల్ ప్రాంతంలో చెత్త, పిచ్చిమొక్కలు తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల రాధ, ఉపసర్పంచ్ సత్యం, గ్రామకార్యదర్శి వినోద్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో పల్లెప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీపీ పస్క నర్సయ్య జడ్పీటీసీ మెట్టు సంతోష్ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బంటు దయానంద్, ప్రత్యేకాధికారి సవిత, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం కమలాపూర్, బీబీపూర్ గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను డీఆర్డీవో చందర్‌నాయక్ పరిశీలించారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్ భావన, పంచాయతీ కార్యదర్శి కవిత తదితరులున్నారు.
ధర్పల్లి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో సర్పంచుల ఆద్వర్యంలో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని ఎంపీడీవో నటరాజ్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఇందల్వాయి మండలం మల్లాపూర్, ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్పల్లి, లోలం గ్రామాల్లో పిచ్చిమొక్కలను తొలగించారు. పల్లెప్రగతి పనుల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీవో రాములు నాయక్ కోరారు. జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లిలో చేపట్టిన పనులను జడ్పీటీసీ తనూజారెడ్డి పరిశీలించారు. సికింద్రాపూర్‌లో ఎంపీపీ కుంచాల విమలారాజు, కొలిప్యాక్‌లో మాజీ ఎంపీపీ డీకొండ హరిత పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్రూర్, కోటగిరి మండలాల్లో పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగింది. కోటగిరి మండలం యాద్గార్పూర్ నర్సరీలో చేపడుతున్న పనులను సర్పంచ్ విజయసాధన పరిశీలించారు. చిక్కడ్‌పల్లిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించారు. సులేమాన్‌నగర్‌లో మురికికాలువలను శుభ్రం చేయించారు.