నిజామాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):సర్కారు స్కూళ్లను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఐదు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాలు అమలు పర్చేందుకు విద్యా శాఖ రెడీ అవుతున్నది. ముఖ్యంగా మన ఊరు-మన బడిలో భాగంగా సర్కారు స్కూళ్లను బాగు చేసే క్రతువుకు ప్రభుత్వం సిద్ధమైంది. మౌలిక సదుపాయాల కల్పనతో కార్పొరేట్ స్థాయి హంగులను జోడించేందుకు రూ.వేల కోట్లను రిలీజ్ చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విద్యా విధానంలోనూ మార్పులు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట కల్పించేందుకు సమాయత్తం అవుతున్నది. ఇందులో భాగంగానే 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగనున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 2,423 ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల బోధనకు అడుగులు పడుతున్నాయి. కొద్ది రోజుల్లోనే స్కూళ్లు పున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఇంగ్లిష్ మీడియం చదువులపై ప్రజల్లో ప్రచారం సైతం చేస్తున్నారు.
ఒకటి నుంచి 8తరగతి వరకు…
పట్టణీకరణ ప్రభావం, గ్రామాల్లో పెరిగిన ఆర్థిక స్వావలంబనతో ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను పంపడం క్రమంగా పెరుగుతున్నది. కొన్నేండ్ల నుంచి ఈ సంస్కృతి స్టేటస్ సింబల్‌గా మారడంతో ప్రభుత్వ బడులు క్రమేణా ఆదరణ పడిపోతూ వచ్చాయి. అత్యున్నత ప్రమాణాలతో బోధకులు ఉన్నప్పటికీ అవేవీ పట్టని నేటితరం తల్లిదండ్రులు మాత్రం భారమెక్కువైనా ప్రైవేటుకే మొగ్గు చూపడం కనిపిస్తోంది. సర్కారు స్కూళ్లు ఆదరణ లేక కుదేలవుతున్న పరిస్థితులు నెలకొనగా ఇప్పుడిప్పుడే పాత రోజులు తిరిగి సంతరించుకోబోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1166 ప్రభుత్వ స్కూళ్లలో, కామారెడ్డిలో 1257 స్కూళ్లలో 2022-23 విద్యా సంతవ్సరంలో ఆంగ్ల బోధన అమల్లోకి రాబోతున్నది.
ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. దీంతో చాలా మంది పేద ప్రజలకు తలకు మించిన భారంగా మారిన స్కూల్ ఖర్చులు తప్పనున్నాయి. ఆంగ్ల బోధనపై విస్తృతంగా ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. విద్యా శాఖ ద్వారా ప్రజల్లో చైత న్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు.
కార్పొరేట్‌కు దీటుగా…
ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో వినూత్న నిర్ణయాలతో సర్కారు స్కూళ్లకు ఊపిరి పోశారు. తాజాగా మన ఊరు… మన బడి కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి దశలో వందలాది స్కూళ్లను ప్రభుత్వం గుర్తించింది. నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 217, ప్రాథమికోన్నత పాఠశాలలు 40, ఉన్నత పాఠశాలలు 150 కలిపి మొత్తం 407 స్కూళ్లను గుర్తించింది. రూ.160 కోట్లతో సదుపాయాలు కల్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 185 ప్రాథమిక, 42 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 351 స్కూళ్లు ఉన్నాయి. మన ఊరు… మన బడి కార్యక్రమంలో భాగంగా ఉభయ జిల్లాల్లో 758 ప్రభుత్వ బడుల్లో రూ.100కోట్లతో పనులు జరుగుతున్నాయి. రెండు దశాబ్దాలుగా చాలా మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆంగ్ల మాధ్యమ బోధన, కార్పొరేట్ స్థాయి వసతులు ఉండడం మూలంగా ఖర్చును లెక్క చేయకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ బడులను వీడుతున్నారు. తిరిగి పూర్వ వైభవం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడుతున్నది.
సర్కారు బడులపై ఆసక్తి…
కొంతకాలంగా సర్కారు బడులను వదిలి ప్రైవేటు లో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడానికి ముఖ్య కారణం ఆంగ్లబోధనే. గతేడాది ప్రభుత్వం నిర్వహించిన పలు సర్వేల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా ఇదే. ప్రజల కోరిక మేరకు సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీసుకు వస్తే భారీ మార్పులు తథ్యమని నిపుణులు సూచించడంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. సీఎం కేసీఆర్ మొదటి నుంచి ప్రభుత్వ విద్యను సామాన్యులకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంగ్ల బోధన అన్నది తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు సైతం విడుదల చేశారు. మాతృభాషకు విలువనిస్తూనే అంతర్జాతీయ అనుసంధాన భాషగా మారిన ఇంగ్లిష్‌కు పెద్ద పీట వేస్తున్నారు. భవిష్యత్తులో నేటి తరం పిల్లలంతా రాణించాలంటే తప్పనిసరిగా ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల బోధన ఉంటే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీ విద్యాయజ్ఞం జరుగుతుండడం విశేషం.
తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గినట్లే..
ఇంగ్లిష్ మీడియం చదువు కోసం ప్రతి ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించేవారం. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభం అవుతున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇక మాలాంటి పేదలకు ఫీజుల భారం తగ్గినట్లే..
– పుట్టి నడ్పి నాగన్న, బోర్గాం, రెంజల్
పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు
అందరిని చదివించేలా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రోత్సహిస్తున్నది. గతంలో ఇంగ్లిష్ మీడియం చదువు కొందరికి సొంతమయ్యేది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్లబోధన ప్రారంభిస్తున్న ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పది. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారు.
-లింగాల విఠల్, తాడ్‌బిలోలి