బిచ్కుంద, జూన్ 6 : మండల కేంద్రంలో రెండు నెలల క్రితం తాళాలు వేసిన ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకొని రిమాండ్‌కు పంపినట్లు బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి తెలిపారు. బిచ్కుంద సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పో లీసులు సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు నంబరు ప్లేటు లేని వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన విజయ్ కాంబ్లే, గోపి మండల కేంద్రంలోని పరుశురాములు, సుభాష్ ఇండ్ల తాళాలను పగులగొట్టి 28 తులాల వెండి, 26 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. విజయ్ కాంబ్లే అనే వ్యక్తిపై 60 కేసుల వరకు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడడంతో పీడీ యాక్ట్ నమోదు అయ్యిందని డీఎస్పీ తెలిపారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సదాశివనగర్, మహారాష్ట్రలోని నాయిగావ్, ఉద్గీర్ ప్రాంతా ల్లో విజయ్ కాంబ్లే దొంగతనాలకు పాల్పడినట్లు అక్కడి పోలీసులు తెలిపారని డీఎస్పీ వివరించారు. బిచ్కుంద ప్రాంత ప్రజలు ఇండ్లకు తాళాలు వేసేటప్పుడు నగదు, నగలు బ్యాంకు లాకర్లో పెట్టి వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించినారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.