ఖలీల్‌వాడి, జూన్ 6 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణాధికారి వెంకన్న, పిల్లల వైద్య నిపుణుడు శ్రీశైలం కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోర్టు చౌరస్తా, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌లోని హనుమాన్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ వెంకన్న మాట్లాడుతూ ప్రతిరోజూ సైకిల్‌ను ఉపయోగిస్తే శారీరకంగా, మానసికంగా మేలు కలుగుతుందన్నారు.
గుండెజబ్బులు, మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు తదితర అనేక రకాల వ్యాధులబారిన పడకుండా ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే సైకిల్ ఉపయోగించడం అలవాటు చేసుకునేవారు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు.
కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు తోట రాజశేఖర్, ఏవో గంగాధర్, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ చైతన్యకుమార్, ఐఎంఏ సభ్యుడు డాక్టర్ సంతోష్, ఎన్సీడీ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్, ప్రజాసైన్స్ వేదిక జిల్లా అధ్యక్షుడు గంగాకిషన్, ఎన్సీఎస్సీ కో-ఆర్డినేటర్ గోవర్ధన్, వాసవీ క్లబ్ సభ్యుడు శివ, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.