నిజామాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పక్కాగా ఫలాలను అందిస్తున్నాయి. ప్రారంభ ఆర్భాటాలకే పరిమితం కాకుండా… ఆదర్శవంతంగా కార్యక్రమాలు అమలవుతన్నాయి. ఆదర్శ బాటలో గ్రామాలు, పట్టణాలు నడవడంతో అంతటా ఫలితాలు కనిపిస్తున్నాయి. అడుగడుగునా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు స్వయంగా పాల్గొని పర్యవేక్షించడంతో పది రోజుల కార్యక్రమం అట్టహాసంగా కొనసాగుతున్నది. పురపాలికల్లో, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగై ప్రజల ఇక్కట్లు తొలగిపోతున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన కార్యక్రమాలతో అధికార యంత్రాంగం పట్టణాలు, పల్లె బాట పట్టడంతో గ్రామాలన్నీ సందడిగా మారాయి. పండుగ వాతావరణంలో మొక్కల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ, అసంపూర్తి పనులను చేపడుతున్నారు. పక్కా ప్రణాళికలతో పచ్చదనం, పారిశుద్ధ్య నిర్వహణ పనులు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. గత పల్లె, పట్టణ ప్రగతిలో వెలుగు చూసిన లోపాలను సవరించుకుంటూ ఐదో విడుత పల్లె ప్రగతిని, నాల్గో విడుత పట్టణ ప్రగతితో మెరుగైన లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.
జనాల్లోకి ప్రజాప్రతినిధులు, అధికారులు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రధానంగా రహదారులు, మురుగు కాలువలు, ఖాళీ స్థలాలను శుభ్రం చేయిస్తున్నారు. ఖాలీ స్థలాల్లో, రహదారులు, వీధులకు ఇరువైపులా మొక్కలు నాటారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేయడం, ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు, తీగలు తొలగించేందుకు ప్రతిపాదించడం, వీధి దీపాల ఏర్పాటు, రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేయడం, నీటి లీకేజీలను గుర్తించి అరికట్టడం, పని చేయని బోరు బావులు, బావులను పూడ్చివేయడం, అవసరమైన చోట్ల మరుగుదొడ్లు నిర్మించడం, మెరుగైన నిర్వహణకు చర్యలు తీసుకోవడం తదితర పనులు చేపడుతున్నారు. ప్లాస్టిక్కు వ్యతిరేకంగా చైతన్యం తేవడం, కళలు, సాంస్కృతిక, క్రీడాంశాల్లో ప్రోత్సాహించడంతోపాటు వార్డు ప్రత్యేక అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 3న ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉల్లాసభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. గతంలో పది రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఈసారి 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18 వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
చెత్త సమస్యకు చెక్
గ్రామాల్లో గతంలో చెత్తా చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వేసేవారు. ఇప్పుడు సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేయడంతో వీధులు శుభ్రంగా మారుతున్నాయి. కంపోస్ట్ షెడ్లు నిర్మించి ఎరువుల తయారీని ప్రోత్సహిస్తున్నారు. చెత్త తొలగింపునకు ఇతర అవసరాలకు ప్రతి గ్రామానికీ ఒక ట్రాక్టర్, నీటి ట్యాంకర్ను ఇప్పటికే కొనుగోలు చేశారు. హరితహారంలో మొక్కలను తీసుకెళ్లడానికి, నాటిన వాటికి నీళ్లు పెట్టడానికి వీటిని వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ల కొనుగోలుతో గ్రామాల్లో పలు సమస్యలు పరిష్కారమయ్యాయి. డంపింగ్ యార్డుల వినియోగం ఉమ్మడి జిల్లాలో అంతంత మాత్రంగా ఉండడంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. సేకరించిన చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువుగా మలిచే ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించాలని ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం వాటిపై దృష్టి కేంద్రీకరించింది. గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి.
ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం
గతంలో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పంచాయతీ, పురపాలక సంఘాల్లో ప్రకృతి వనాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఐదో విడుత పల్లె ప్రగతి, నాల్గో విడుత పట్టణ ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనను అమలుచేసింది. ఈసారి ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాల పేరిట యువత ఆట విడుపునకు మైదానాలను అందుబాటులోకి తీసుకురావాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా ఈ నెల 2న మండలానికి రెండేసి చొప్పున క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. నిజామాబాద్లో గ్రామీణ ప్రాంతాల్లో 54 క్రీడా ప్రాంగణాలు ప్రారంభం కాగా మున్సిపాలిటీల్లో అదనంగా 10 వరకు అందుబాటులోకి తెచ్చారు. కామారెడ్డిలో జిల్లా వ్యాప్తంగా 40కి పైగా క్రీడా ప్రాంగణాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఊరూరా క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. ప్రభుత్వ, రెవెన్యూ స్థలాలను ఇందుకోసం అన్వేషిస్తోంది. గ్రామాలకు పల్లె ప్రకృతి వనాలు, మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాల మాదిరిగానే తెలంగాణ క్రీడా ప్రాంగణాలు సైతం అదనపు ఆకర్షణగా నిలువనున్నాయి.
గుర్తించిన సమస్యలకు పరిష్కారం
పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ముందస్తుగా గుర్తించిన పనులను నిర్వహిస్తున్నాం. గ్రామ పంచాయతీ పాలకవర్గాల సహకారంతో పనులు చేపడుతున్నాం. చెత్త సేకరణ తదితర అంశాలపై పంచాయతీల్లో పాలకవర్గాలకు అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం.ఈ నెల18వరకు బాధ్యతగా పల్లె ప్రగతి పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, క్షేత్ర స్థాయి సిబ్బందిని కోరుతున్నాం. ప్రజలు కూడా సహకరించాలని విన్నవిస్తున్నాం.
– జయసుధ,నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి