విద్యానగర్, జూన్ 5 : సంకల్ప బలం, పట్టుదలతో శ్రమిస్తే విజయం చెంతకు చేరుతుందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. తెలంగాణ గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం మానకూడదన్నారు. ఆత్మ విశ్వాసంతో సంసిద్ధులై ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ… సిలబస్ పై పట్టు కలిగి ఉండాలన్నారు.దీంతోపాటు పాత ప్రశ్నా పత్రాలను విశ్లేషించుకుంటూ పరీక్షా విధానానికి అనుగుణంగా ప్రిపేర్ కావాలని సూచించారు. కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని,పోటీ వాతావరణంలో ఏకాగ్రతతో చదవాలన్నారు. కార్యక్రమంలో గ్రూప్ -1 అధికారులు అదనపు కార్యదర్శి హన్మంతు నాయక్, గ్రూప్ -1 అధికారి కాకర శ్రీనివాస్, శశికిరణా చారి, ఆర్టీవో వాణి, పరశురాములు, ఎన్. వెంకట్, జిల్లా అధికారులు షబానా, శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్,శౌర్య అకాడమీ డైరెక్టర్ నరేశ్, రామ్ కుమార్ గౌడ్, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బుగ్గారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.